Greenfield National Highway Land Acquisition Completed : మంచిర్యాల జిల్లా వరంగల్ వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి భూ సేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో మంథని మండలంలో పనులు జోరందుకున్నాయి. రూ.2,606 కోట్ల అంచనాతో చేపట్టే జాతీయ రహదారి పనులకు 2021 ఆగస్టులో ప్రభుత్వం భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం సేకరణ దాదాపు పూర్తి కావడంతో ప్రభుత్వం ఆ భూములను జాతీయ రహదారి అథారిటీకి అప్పగించింది.
మొత్తం 108 కి.మీ దూరం నిర్మించే జాతీయ రహదారి పనులను మూడు ప్యాకేజీల కింద విభజించారు. 1వ ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి మంథని మండలం పుట్టపాక వరకు 31 కి.మీ దూరానికి రూ.873లో 2వ ప్యాకేజీ కింద పుట్టపాక నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల దూరానికి రూ.881 కోట్లు, 3వ ప్యాకేజీ కింద భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి నుంచి హనుమకొండ జిల్లా ఊరగొండ వరకు 39 కి.మీ దూరానికి రూ.851 కోట్లు కేటాయించారు.
పరిహారం చెల్లింపులో జాప్యం : డివిజన్‌లో మొత్తం 204.46 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇప్పటివరకు 164.49 హెక్టార్లకు పరిహారం చెల్లించగా, వివిధ కారణాలతో 19.73 హెక్టార్లు చెల్లింపులు జరగాల్సి ఉంది. 1,519 మంది నిర్వాసితుల్లో 1,303 మందికి రూ.47.13 కోట్ల పరిహారం అందించారు. మరో 216 మందికి రూ.8.51 కోట్లు చెల్లించాలి. సాగులో ఉన్నవారి పేరిట రికార్డులో లేకపోవడం, సాదాబైనామాలు ఉండటం, వివాదాలు, కోర్టు కేసులతో పరిహారం చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటుంది.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో : పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందంటూ రైతులు ఆర్బిట్రేషన్ కింద కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పరిహారం మొత్తాన్ని పెంచారు. రూ.51.17 కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.46.12 కోట్లు చెల్లించగా ఇంకా రూ.5.04 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. రికార్డులు సరిగ్గా లేని వారికి పరిహారం చెల్లించలేకపోతున్నామని ఆర్డీవో సురేశ్ తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో మంథని డివిజన్ పరిధిలో మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల్లో 505 ఎకరాల వ్యవసాయ భూములు, ఇతర కట్టడాలు పోతున్నాయి. వీటి కోసం 2021 ఆగస్టులో భూ సేకరణ చేపట్టగా మూడేళ్ల అనంతరం నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. సేకరించిన భూములను జాతీయ రహదారి అథారిటీకి ప్రభుత్వం అప్పగించింది.
రెండేళ్లలో పూర్తి : 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా రహదారిని నిర్మించనున్నారు. ప్యాకేజీ-1లో జైపూర్ మండలం నర్సింగాపూర్, చెట్టుపల్లి, నాగారంలలో ఫ్లైఓవర్లు, పోతారం వద్ద గోదావరిపై వంతెన, పుట్టపాకలో జంక్షన్, ఓడేడ్ వద్ద మానేరుపై వంతెన, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ - హైదరాబాద్ నుంచి అమరావతికి నేరుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే