పిల్లలకు పర్యావరణ పాఠాలు - ఈ గ్రీన్ పేరెంటింగ్ గురించి మీకు తెలుసా?
పిల్లలకు పర్యావరణంపై అవగాహన - ప్లాస్టిక్ వినియోగ అనర్థాలపై పాఠాలు - విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ విధానం గురించి మీకు తెలుసా?

Published : September 18, 2025 at 2:42 PM IST
Green Parenting Tips : పెరుగుతున్న జనాభాతో ఆడువుల విస్తీర్ణం విపరీతంగా తగ్గుతోంది. పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ అసమతుల్యతతో విపరీత వాతావరణ పరిస్థితులు, విపత్తులూ చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి పరిరక్షణకు కృషి చేయడం చాలా ముఖ్యం. దీనిపై భావిభావరత నిర్మాతలైన చిన్నారులకు పర్యవరణ స్పృహ కల్పించాలి. దీంట్లో భాగంగా విదేశాల్లో ప్రాచుర్యం పొందిన 'గ్రీన్ పేరెంటింగ్'ను మనమూ పాటిద్దాం.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటా వనమహోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తన పేరు మీద ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని చిన్నారులకు తల్లిదండ్రులు సూచించాలి. వీలైతే పుట్టిన రోజున, పండుగ రోజుల్లో మొక్క నాటి కాపాడేలా ప్రోత్సహించాలి. తోటల పెంపకంలో భాగస్వాములను చేయాలి.
- నీటిని పొదుపుగా వినియోగించేలా అవగాహన కల్పించాలి. విచ్చలవిడి వినియోగంతో నీటి కరువు నష్టాలను వివరించాలి. ఆహార వృథాను అరికట్టడం పైనా దృష్టి సారించాలి. ఇళ్లల్లో విద్యుత్తు దీపాలు అనవసరంగా వెలుగుతుంటే వారితోనే ఆర్పేయించాలి. అవసరం లేని సందర్భాల్లో స్విచ్చులను ఆఫ్ చేయమనాలి.
- ప్లాస్టిక్ వినియోగిస్తుండటంతో కలిగే అనర్థాలపై పసిప్రాయం నుంచే వివరించాలి. స్కూల్స్‌కు ఆహారం, స్నాక్స్‌ను ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా స్టీల్ డబ్బాల్లో, నీటిని కూడా స్టీల్, ఇత్తడి, రాగి సీసాల్లో నింపి పంపించాలి. ఇళ్లల్లోనూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలి.
- పిల్లలకు అప్పటికాలంలో ప్లాస్టిక్ వాడకుండా వారి పనులు ఎలా చేసుకునేవారో, దానివల్ల వారు ఎంత ఆరోగ్యంగా వారి జీవనాన్ని సాగించారో పిల్లలకు వివరించాలి. ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే అనర్ధాలు, కలిగే ఆరోగ్య సమస్యలు వారికి వివరించాలి. అది భూమిపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పాలి.
- చిన్నప్పటి నుంచే నడక, సైక్లింగ్‌ను అలవాటు చేయాలి. వాటివల్ల కలిగే ప్రయోజనాలను, వాతావరణ కాలుష్యానికి కారణాలనూ వివరించాలి. వీటితో పిల్లలకు శారీరక వ్యాయామం కలగడమే కాకుండా పెద్దయ్యాక వాహనాల వినియోగం తగ్గించాలన్న అవగాహన పెరుగుతుంది.
- బయటకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కాకుండా జూట్, కాగితపు సంచులు తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలి. మొక్కల ప్రాధాన్యం వివరిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారి జీవిత విశేషాలను వివరించాలి. ఇళ్లు, పాఠశాలల్లో తరచూ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పాత వస్తువులను తిరిగి వినియోగించేలా ప్రోత్సహించాలి.
- ఇంట్లో ఎవరైన పుట్టిన రోజు జరిగితే వారికి గిఫ్ట్‌గా మొక్కలు ఇచ్చేలా నేర్పించాలి. అది వారికి గుర్తుండిపోతుంది అలాగే మొత్త వల్ల పర్యావరణానికి మేలు జరుగుతోంది. హాలిడేస్ ఉన్నప్పుడు సీడ్ బాల్స్ లాంటివి తయారు చేయించి వాటిని గుట్టల్లో, కొండల్లో చల్లెలా చూడాలి. మొక్కలు నాటే కార్యక్రమాలకు పంపించాలి.
"పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుంది. పచ్చని ప్రకృతిలో ఒడిలో పెరగడంతో ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. చిన్నప్పటి నుంచే పర్యావరణాన్ని పరిరక్షించడంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు." - డా.ఉస్మాన్, మానసిక వైద్య నిపుణులు, సిటీ నర్సింగ్ హోం, హైదరాబాద్
ఆవు కడుపులో 50కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు- ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
ప్లాస్టిక్ బాటిళ్లతో పడవ తయారీ - విపత్తులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో వినియోగం

