Grand Chariot Festival of Sri Kodandaram of Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం రామయ్య రథోత్సవం కనులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పదిన్నర గంటలకు రథోత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత కోదండరామయ్య రథంపై విహరించారు. భక్తులు చెక్కభజనలు చేశారు. కోలాటాలు ఆడారు. కర్పూర హారతులు పట్టారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
SRI RAMA NAVAMI ANNUAL BRAHMOTSAVAM : శుక్రవారం పండు వెన్నెల్లో శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవ సందర్భంగా కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు. హస్తా నక్షత్ర యుక్త శుభలగ్నంలో జరిగిన జానకిరాముల పరిణయ వేడుకలను తిలకించడానికి వచ్చిన భక్తులకు కల్యాణ తలంబ్రాలను పంపిణీ చేశారు.
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం - 60 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు
వాటితో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, పసుపు, కుంకుమలు అందజేశారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. జగత్ కల్యాణ ఘట్టం పండు వెన్నెలలో కనులపండువగా సాగింది. సీతారాముల కల్యాణం జరిగిన ప్రాంగణం కొంగొత్త శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. దేశవిదేశాల నుంచి తీసుకొచ్చిన అరుదైన పుష్పాలతో కల్యాణ మండపాన్ని అలంకరించారు.