Audit Officer Attacked in Prakasam : ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లోని సహకార శాఖ కార్యాలయం నుంచి విధులు ముగించుకుని ఆదివారం రాత్రి వేళ ప్రభుత్వ అధికారి రాజశేఖర్ అంబేడ్కర్ భవన్ రోడ్డులోని తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని అడ్డుకున్నారు. ఎవరూ? ఎందుకు అటకాయించారు అని వాళ్లను అడిగేలోపే వారు తమ వెంట తెచ్చుకున్న కారాన్ని రాజశేఖర్ కళ్లల్లో కొట్టారు. ఏం జరుగుతుందో అతడికి అర్థమయ్యేలోగానే కర్రలతో అతణ్ని విచక్షణారహితంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ ముగ్గురి దాడిలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వస్తున్న వాహనదారులు అతణ్ని గమనించి స్థానిక జీజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస రావు, ఒకటో పట్టణ సీఐ వై.నాగరాజు ఆస్పత్రికి వెళ్లారు.
బాధితుడు రాజశేఖర్‌తో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎవరిపైన అయినా ఆయనకు అనుమానం ఉందో అడగ్గా, సహకార శాఖలోని కొందరు ఉద్యోగులపై రాజశేఖఱ్ అనుమానం వ్యక్తం చేశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
అయితే ఈ దాడికి గల కారణం రాజశేఖర్ గతంలో పలు శాఖల్లో అక్రమాలను బయటకు తీయడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం సహకార ఆడిట్ అధికారిగా, సూపర్‌బజార్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో జిల్లా సహకార ఇన్‌ఛార్జి అధికారిగా పని చేశారు. ఆ సమయంలో డీసీఎంఎస్‌తో పాటు పొదిలి హౌసింగ్ సొసైటీ, పల్లామల్లి, కొనకనమిట్ల తదితర ప్రాంతాల్లోని సహకార సంఘాలు, బ్యాంకుల్లో చోటుచేసుకున్న అక్రమాలు, నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన బాగోతాన్నీ బయటకు తీసి విచారణ సాగించారు. దీంతో కొందరు నాయకులు, అదే శాఖలోని ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగా మారడంతోనే ఆదివారం రోజున దారి కాచి మరీ రాజశేఖర్‌పై దాడి చేసినట్లు సమాచారం.