Breast Cancer Awareness Programme in Hyderabad : హైదరాబాద్‌లోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, గత మూడునెలల క్రితం, మార్చి 2025లో మౌంట్ అబూలోని బ్రహ్మ కుమారీస్ ప్రపంచ ప్రధాన కేంద్రంలో ఆన్‌సైట్ మరియు ఆన్‌లైన్‌లో అత్యధిక సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ అవగాహన తరగతులు నిర్వహించి డాక్టర్ రఘురాం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆ తరగతిని నేడు హైదరాబాద్ శాంతి సరోవర్‌లో ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు.
రొమ్ము క్యాన్సర్ నిర్వహణను కొత్త దిశగా : గత ఐదేళ్లుగా అక్టోబర్ నెలలో తెలంగాణ రాజ్‌భవన్‌ను గులాబీ రంగులో వెలుగులు వెలిగించి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ రఘురాం సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన రఘురాం విధేయత, సంకల్పం నిజంగా ఆదర్శప్రాయమైనవని గవర్నర్ తెలిపారు. గత 18 ఏళ్లుగా ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశంలో రొమ్ము క్యాన్సర్ నిర్వహణను కొత్త దిశగా నడిపించాయని పేర్కొన్నారు.
కిమ్స్ - ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ అయిన డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ప్రతి నాలుగు నిమిషాలకు ఒక కొత్త రొమ్ము క్యాన్సర్ కేసు, ప్రతి ఎనిమిదో నిమిషానికి ఒక మరణం జరుగుతోందని తెలిపారు. దేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల కొత్త కేసులు, లక్ష మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు.
ప్రతి సంవత్సరం మామోగ్రామ్ పరీక్ష : భారతదేశంలో అవగాహన లోపం, స్క్రీనింగ్ లేకపోవడం వల్ల 60 శాతం కేసులు చివరి దశల్లోనే గుర్తిస్తున్నారని వివరించారు. తక్కువ వయస్సులో (40-50 సంవత్సరాల మధ్య) రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తోందని చెప్పారు. అలాగే, రొమ్ములపై అవగాహన అవసరమని, ఏవైనా మార్పులు కనిపించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని, 40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
అందరికీ మంచి సందేశం ఇచ్చారు. మహిళ ఒక కుటుంబానికి కేంద్రబిందువు. ఆమె ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. శుభకార్యాల సమయంలో చీరను గిఫ్ట్‌గా ఇవ్వడం కాకుండా, వార్షిక స్క్రీనింగ్ మామోగ్రామ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీని వల్ల ఎంతోమంది ప్రాణాలను రక్షించగలరని పేర్కొన్నారు.
విజేతగా నేడు ఇదే అవగాహనలో : క్యాన్సర్‌ను విజయవంతంగా జయించిన బ్రహ్మ కుమారీస్ హైదరాబాద్ కేంద్రాధిపతి బీకే కుల్దీప్ దీదీ మాట్లాడుతూ నా రొమ్ము క్యాన్సర్ ప్రయాణంలో, డాక్టర్ రఘురాం చేసిన చికిత్స, శ్రద్ధ, సానుభూతితో తనకు ధైర్యం కలిగిందని తెలిపారు. ఆయన నుంచి అందుకున్న ప్రేరణ వల్లనే తాను ధైర్యంగా ముందుకెళ్లగలిగానని వెల్లడించారు. ఒక విజేతగా నేడు ఇదే అవగాహనలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.
తెలంగాణ ప్రజలకు శుభవార్త - అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ సెంటర్లు
గొంతు వాపు, మింగడంలో ఇబ్బందిగా ఉందా? - "థైరాయిడ్" హెచ్చరికలు ఎలా ఉంటాయంటే!