Construction of New Road from Avanigadda to Kodur: ఐదేళ్లపాటు ప్రజలు, ప్రయాణికులకు నరకం చూపింది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ - కోడూరు రహదారి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనదారులు ప్రయాణాలు సాగించేవారు. రోడ్డు పునర్నిర్మాణానికి నిధులు ఇచ్చామని గతంలో సీఎం హోదాలో జగన్ చెప్పినా మరమ్మతులు కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఐదేళ్లపాటు తీవ్ర అవస్థలు: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారులు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకంతో గుంతలమయమైన రోడ్లపై ఐదేళ్లపాటు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే రహదారిపై ప్రయాణమంటేనే ప్రాణసంకటంగా మారింది. 13 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఐదేళ్లపాటు ప్రయాణికులు పడిన కష్టాలు తొలగేలా కూటమి ప్రభుత్వం 16 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతన రహదారి నిర్మాణం చేపట్టింది. పనులు వేగంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లూ గోతుల్లో పడుతూ లేస్తూ వెళ్లిన వాహనదారులు సాఫీగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
2 నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి: గతంలో అత్యవసర పరిస్థితుల్లో కోడూరు నుంచి అవనిగడ్డకు వెళ్లాలంటే ఈ రహదారిపై గంటకుపైగా పట్టేదని ఈలోపే ప్రాణాలు పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు తప్పుతాయని ఆశిస్తున్నారు. మరో 2 నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 10 నిమిషాల నుంచి 15 లోపు అవనిగడ్డకు చేరుకోవచ్చని రెండు లేయర్స్ గా రోడ్డు నిర్మాణం చేస్తున్నామని ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 4 కిలో మీటర్ల వరకు రోడ్డు నిర్మాణం పూర్తి అయిందని అన్నారు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఏళ్లుగా కోడూరు ప్రజలు అనుభవిస్తున్న ప్రయాణ కష్టాలకు చెక్ పడనుంది.
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ - రూ.350 కోట్లతో 4 రోడ్ల విస్తరణ
రూ.154 కోట్లు - 26 కిలోమీటర్లు - విశాఖలో 7 మాస్టర్‌ప్లాన్ రహదారులు