Govt Staff Encouraging Private Hospitals for Delivery: మాతృత్వపు మధురిమలో పులకరించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అమ్మా అనే పిలుపు కోసం పరితపిస్తోంది. ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది. ఇల్లాలు గర్భం దాల్చింది మొదలు బిడ్డకు జన్మనిచ్చే వరకు ఇంటిల్లిపాది దృష్టి అంతా తల్లీబిడ్డ ఆరోగ్యంపైనే ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు జిల్లా ఆసుపత్రి వరకు అన్నింటా ప్రసవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు.
పరీక్షల వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నప్పటికీ ప్రసవాల కోసం చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉండేది. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటుగా నిర్వహిస్తున్న ఆసుపత్రులకు ప్రసవాలకు వచ్చేలా ప్రోత్సహించేవారు. దీనికి కొంతమంది ఆశా కార్యకర్తలను పావులుగా వాడుకుంటున్నారు.
ఓపీ వద్ద వేచి ఉన్న గర్భిణులు: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక స్పీకర్ అయ్యన్నపాత్రుడు గత ఏడాది ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాలపై నమూనాగా అధికారులతో పరిశీలన చేయించినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. 108 అంబులెన్సుల్లో బయలుదేరిన గర్భిణులను ఆశా కార్యకర్తలు కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో 10 నర్సింగ్ హోంలు ఉన్నాయి. ప్రసవాలకు చేరిన 500 మంది నుంచి వివరాలు సేకరించినప్పుడు ఓ ప్రైవేటు ఆసుపత్రికి అత్యధికంగా 240 మందిని తరలించినట్లు, మరో రెండు నర్సింగ్ హోంలలో 180ని చేర్చినట్లు గుర్తించారు.
బెడ్ కష్టాలకు త్వరలోనే చెక్ - ప్రతి మంచం వద్ద ఐసీయూ వసతులు
రూ.50,000 వరకు వసూలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తప్పనిసరి అయినప్పుడే శస్త్రచికిత్స చేస్తారు. అదే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఐదారు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసేందుకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు వసూలు చేస్తున్నారు.
తరలింపుపై గణాంకాలతో వాస్తవాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు 4 రోజుల కిందట ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమావేశమై ప్రైవేటు ఆసుపత్రులకు గర్భిణుల తరలింపుపై గణాంకాలతో వాస్తవాలు వెల్లడించారు. ఎక్కువ కేసులు మాకవరపాలెం మండలం బూరుగుపాలెం, నర్సీపట్నం మండలం వేములపూడి ఆరోగ్య కేంద్రాల నుంచి తరలించారని వెల్లడించారు. ఏ ఆరోగ్య కేంద్రం నుంచి ఏ ప్రైవేటు ఆసుపత్రికి ఎన్ని కేసులు పంపారో కుండబద్దలు కొట్టినట్లు విప్పారు.
ఎందుకిలా జరుగుతోంది, ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో బాగా ప్రసవాలు చేస్తున్నారా, లేక కాసులకు కక్కుర్తిపడి తరలిస్తున్నారా అన్నది తేేల్చాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. తీగలాగితే డొంక కదలడంతో ఇప్పుడు ప్రతి కేసు ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చేలా చూస్తున్నారు. ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తామని చెప్తే అందుకు కారణాలను తెలుసుకోవాలని ఆశా కార్యకర్తలకు ఇప్పటికే సూచించారు.
అమ్మతనంను అడ్డుకునే రక్తహీనతపై గెలుపు- ప్రధానమంత్రి అవార్డుతో మన్యం జిల్లా అధికారులకు ప్రశంస
ఆశా కార్యకర్తలదే కీలక పాత్ర: తల్లి గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు ఆశా కార్యకర్తలు వారిని కనిపెట్టుకు ఉంటారు. ప్రసవం సమయంలో వెన్నంటి సహకరిస్తుంటారు. చాలామంది ఆశాలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలనే సూచిస్తుంటారు. కొంతమంది ప్రైవేటు ఆసుపత్రులు బాగుంటాయని సూచిస్తుంటారు. ఆశా కార్యకర్తలు తీసుకువచ్చే ప్రతి కాన్పునకు రూ.2,000 వరకు ప్రైవేటు వైద్యులు ప్రోత్సాహంగా ఇస్తున్నారు. ఇంకొందరు 6 నెలలకోసారి విందు భోజనాలు ఏర్పాటు చేసి చీరలు బహుమతులుగా ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
కొందరికి మెమోలు ఇచ్చాం: ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువ కేసులు తరలించారని ఆరోపణలు ఉన్న ఆశా కార్యకర్తలకు మెమోలు ఇచ్చామని విశాఖ జిల్లా డీపీఎంఓ డాక్టర్ ప్రశాంతి తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు చేయాలని మార్గదర్శకాలున్నట్లు తెలిపారు.
గర్భిణులను అవసరమైతే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి, పరిస్థితి తీవ్రతను బట్టి విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి పంపాలని అలా కాకుండా ఎవరైనా ఈ విషయంలో మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రైవేటు ఆసుపత్రులకు పంపినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 100 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలన్నదే లక్ష్యమని డాక్టర్ ప్రశాంతి తెలిపారు.
గర్భిణీలు మెట్లు ఎక్కకూడదా? ఎక్కువ సార్లు స్నానం చేస్తే ఇబ్బందా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?