Guidelines for Exemptions on Employee Transfers : ఉద్యోగుల బదిలీల మినహాయింపు అంశంలో ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. సేకరించాల్సిన ధ్రువపత్రాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఉద్యోగ సంఘాల నేతలు మినహాయింపులు కోరితే తగిన ధ్రువపత్రాలు ఇవ్వాలని సూచనలు చేసింది. కలెక్టర్, ఉద్యోగ సంఘాల నేతలు ధ్రువీకరణ చేయాలని స్పష్టం చేసింది. బదిలీల మనహాయింపుతో గతంలో కొందరు ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన వారిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. బదిలీ మినహాయింపు కోరేవారు సరైన ధ్రువపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సర్క్యులర్ జారీ చేశారు.
AP Govt Employees Transfers 2025 : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి జూన్ 2 వరకు నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జూన్ 2వ తేదీవరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులే. అలాగే 2026 మే 31లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలన కారణాలతో బదిలీ చేయొచ్చని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.
బదిలీల్లో వారికి ప్రాధాన్యం : బదిలీ కోసం ఒక స్టేషన్‌లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు కానీ కార్యాలయం, సంస్థను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేసింది. బదిలీల్లో దృష్టి సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలున్న స్టేషన్‌కు బదిలీ అడిగితే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పనిచేసిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి, భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వైద్య సదుపాయాలున్న చోటుకు బదిలీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యముంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం - జూన్ 11తో ముగియనున్న ప్రక్రియ