రుషికొండ ప్యాలెస్‌లను ఎలా వినియోగిద్దాం? - ప్రజల సలహాలు, సూచనలు కోరిన ప్రభుత్వం
విశాఖ రుషికొండ ప్యాలెస్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు - ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ నోటీసు జారీ సహా వెబ్‌సైట్‌లో పర్యాటక అభివృద్ధి శాఖ ఆహ్వానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2025 at 4:08 PM IST
Government Public Notice For Suggestions on Rushikonda : విశాఖ రుషికొండ పై గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కూటమి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ప్రజల భాగస్వామ్యం తీసుకుని గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దాలని నిర్ణయించింది. అనాలోచితంగా విలాసవంతమైన భవనాల పేరిట వందల కోట్లు గత ప్రభుత్వం దుర్వినియోగం చేయగా ఆ ప్రజా ధనాన్ని తిరిగి ప్రజలకు చెందేలా చేయడం, తద్వారా ఆ ప్రాంతం అభివృద్ది చేసేలా అత్యున్నత ఆలోచనలు చేస్తోంది.
రుషికొండపై ప్రజాభిప్రాయం కోరిన సర్కార్: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే మార్గాలను అన్వేషణ చేపట్టింది. ఆ ప్యాలెస్‌లను ఎలా వినియోగించాలో సూచనలు, సలహాలు పంపాలని ప్రజలను కోరింది. దీనికోసం ప్రత్యేకంగా మెయిల్ ఐడీని ఏర్పాటు చేసి సులువుగా వారి ఆలోచనలను ప్రభుత్వ పెద్దలకు పంపే ఏర్పాట్లు చేసింది. ఎవరైనా సరే అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడు రోజుల్లోపు పంపవచ్చు. వీటన్నింటిని పరిశీలించి అత్యున్నతంగా ఉన్న సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అత్యున్నత మార్గాల్లో రుషికొండ ప్యాలెస్‌లను ప్రజలకోసం అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి సర్కారు ఒక్కోటిగా సరిదిద్దే చర్యలు తీసుకుంటోంది. విశాఖలో రుషి కొండను విధ్వంసం చేసి సుమారు రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవంతులను ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోంది. గతంలో ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం తెచ్చే టూరిజం రిసార్టులతో కూలగొట్టిన జగన్ పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి, కొండను భారీగా తొలచి మరీ తాను నివాసం ఉండేందుకు విలాసమవంతమైన ప్యాలెస్ సహా సీఎం క్యాంపు కార్యాలయం పేరిట భవనాలను నిర్మించారు.
ప్యాలెస్ నిర్వహణకే నెలకు రూ.25 లక్షలు: తదనంతరం వచ్చిన ఎన్నికల్లో జగన్ సర్కార్ ఘోరంగా ఓడిపోగా కూటమి ప్రభుత్వం అమరావతినే రాజధానిగా చేసుకొని పాలన కొనసాగిస్తుంటంతో 15 నెలలుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. గతంలో రిసార్టుల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు కోటి రూపాయలు పైగా ఆదాయం వస్తుండగా వాటి కూల్చివేతతో ప్రభుత్వానికి ఆ మేరకు ఆదాయంలో గండిపడింది.
ప్యాలెస్‌ల నిర్వహణకే నెలకు రూ.25 లక్షల చొప్పున ఏడాదికి రూ.3 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన దుస్ధితి ఏర్పడింది. రుషికొండ ప్యాలెస్‌లను వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవడం తద్వారా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని పొందేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. వీటిని వీలైనం త్వరగా వినియోగంలోకి తీసుకు రావాలని సంకల్పించి అధ్యయనం కోసం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు.
ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ : మంత్రులు కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి ప్యాలెస్‌ల వినియోగంపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. సచివాలయంలో శుక్రవారం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రుషికొండ ప్యాలెస్ వినియోగ మార్గాలపై చర్చించింది. రుషి కొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకు రావడం సహా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశాలపై కసరత్తు చేశారు. రుషికొండ ప్యాలెస్‌లను అత్యుత్తమ వినియోగ మార్గాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. మంత్రుల ఆదేశాలతో ప్రజాభిప్రాయాలు పంపేందుకు అధికారులు ప్రకటన జారీ చేశారు.
రుషికొండ ప్యాలెస్‌లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆతిథ్యం కల్పించేలా సకల సదుపాయాలు, హంగులు ఉన్నాయి. 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.451.67 కోట్ల వ్యయం చేసి వీటిని నిర్మించారు. నాలుగు మేజర్ బ్లాక్‌లుగా విభజించి వాటిలో జీప్లస్ 1 స్థాయిలో 7 ప్యాలెస్ లను నిర్మించారు. విజయనగర బ్లాక్ - 3 యూనిట్లు , గజపతి బ్లాక్ - 1 యూనిట్ ,కళింగ బ్లాక్ - 1 యూనిట్, వేంగి బ్లాక్ 2 యూనిట్లుగా నిర్మించారు. వీటిలో విలాసవంతమైన గదులు, విందు ఇచ్చేందుకు బాంకెట్ హాల్స్, అధునాతన రెస్టారెంట్లు, స్పా, జిమ్‌లు, సమావేశ మందిరాలు, లాంజ్‌లు, స్టాఫ్ అకామిడేషన్ వసతులు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా, ఆతిథ్య కేంద్రంగా ఉంచేందుకు ఆవకాశాలున్నాయి. రుషికొండ భవనాలను అత్యుత్తమ వినియోగ మార్గాలపై ప్రజల సూచనలు, సలహాలు కోరింది.
పౌరులు సలహాలు ఇవ్వొచ్చు: పౌరులు తమ సూచనలు, సలహాలను rushikonda@aptdc.in మెయిల్ అడ్రస్‌కు ఏడు రోజుల్లోగా పంపాలని ఏపీ టూరిజం అథారిటీ స్పష్టం చేసింది. ప్యాలెస్‌లు సహా ఆనుకున్న ఉన్న ప్రదేశాన్ని దేనికోసం వినియోగిస్తే బాగుంటుందో తెలియజేయవచ్చు. రుషికొండ ప్యాలెస్‌లపై పర్యాటక ప్రమోషన్ పెంచడంపై అభిప్రాయాలు పంపవచ్చు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు విధానాల అమలుపైనా సూచనలు చేయవచ్చు. రుషికొండలో పర్యావరణ పర్యాటకం అభివృద్దికి సంబంధించి ఆలోచనలు పంపవచ్చు. రుషికొండ ప్యాలెస్‌ను సాంస్కృతిక కేంద్రాలుగా మార్చే ప్రతిపాదన సహా ఇతరత్రా ఆలోచనలను తెలియజేయవచ్చు.
8 ప్రముఖ సంస్థలు ఆసక్తి : రుషికొండ ప్యాలెస్ సహా ఇతర భవనాల వినియోగం కోసం 8 ప్రముఖ సంస్థలు ఆసక్తి కనపరిచాయి. 5 సంస్థలు సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్‌లను ఇప్పటికే అధికారులకు పంపాయి. వీటిని మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలనూ ప్రభుత్వం ఆహ్వానించింది. తమ ఆలోచనలతో ముందుకు రావాలని కోరింది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఏపీ టూరిజం అథారిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విజయవాడ ఆటోనగర్ స్టాలిన్ కార్పోరేట్లో ఏపీ టూరిజం అథారిటీ కార్యాలయంలో సమావేశం జరగనుంది.
ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఆతిథ్య గ్రూపులు, ఆసక్తి ఉన్న సంస్థల ప్రతినిథులు సమావేశంలో పాల్గొనవచ్చని పర్యాటక శాఖ తెలిపింది. రుషికొండ ప్యాలెస్‌ల వినియోగంపై ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) చేయవచ్చని వెల్లడించింది. రుషికొండ భవనాల వినియోగంపై సమావేశంలో సంస్థలు సైతం అభిప్రాయాలు తెలియజేయవచ్చని స్పష్టం చేసింది.
పౌరులు, సంస్థలిచ్చిన అన్ని సూచనలు, సలహాలను మంత్రుల బృందం సమీక్షిస్తుంది. మంత్రుల బృందం సమీక్ష తర్వాత వినియోగించే విధానం పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రజలకు ఉపయోగపడటం సహా పర్యాటకంగా అభివృద్ది చెందడం, ప్రభుత్వానికీ ఆదాయం వచ్చేలా అత్యుత్తమ విధానాలు తీసుకుని ఆయా సంస్థలకు ఈ భవనాలను అప్పగించనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ - ఫ్లాగ్ ఎగురవేసిన మంత్రి దుర్గేష్
'ఎవరైనా సిఫార్సు చేశారా?' - రుషికొండ బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం

