Government Issues Orders For Teacher Transfers : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుందని ఇందులో పేర్కొంది.
ఏపీలో ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ నిబంధనలు 2025 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్, ప్రైమరీ స్కూళ్ల నుంచి హైస్కూల్ వరకు జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు ఇచ్చింది. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇతర కేడర్ బదిలీల్లో హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతీ విద్యా సంవత్సరంలో మే 31 తేదీ నాటికి సదరు పాఠశాలలో 5 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన ఉపాధ్యాయులకు బదిలీ వర్తించనుంది.
కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు, కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు, ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంది. మే 31 నాటికి ఖాళీలు, పదవీ విరమణ చేసే స్థానాలు, హేతుబద్ధీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాదికిపైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలను చూపించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ బదిలీలు, పదోన్నతులూ జూన్ 11తో పూర్తి కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి.
- రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పదవీ విరమణకు రెండేళ్లు మాత్రమే గడువు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.
- 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లు, హెచ్‌ఎంలు.. బాలికల పాఠశాలల్లో పని చేస్తుంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. వీటిల్లో నియమించేందుకు మహిళా టీచర్లు లభ్యంకాని పరిస్థితుల్లో 50 ఏళ్లు దాటిన వారిని నియమిస్తారు.
- ఎన్‌సీసీ అధికారిగా ఉన్న వారిని మరో ఎన్‌సీసీ పాఠశాలకే బదిలీ చేస్తారు. మరో ఎన్‌సీసీ పాఠశాల లేకపోతే అభ్యర్థన మేరకు పాత పాఠశాలలోనే కొనసాగవచ్చు.
- మిగులు పోస్టును అవసరమైన పాఠశాలకు మార్చే క్రమంలో జూనియర్ టీచర్ రేషనలైజేషన్‌కు గురవుతారు. జూనియర్ టీచర్లలో దివ్యాంగులు ఉంటే మినహాయింపు ఉంటుంది. ఒకవేళ సీనియర్ టీచర్ వెళ్లేందుకు ఆసక్తి చూపితే ఎలాంటి హేతుబద్ధీకరణ పాయింట్లూ ఇవ్వరు.
- స్టేషన్ పాయింట్లు ఏడాదికి క్యాటగిరీ-1కు 1, క్యాటగిరీ-2కు 2, క్యాటగిరీ-3కు 3, క్యాటగిరీ-4కు 5 పాయింట్లు ఇస్తారు. గరిష్ఠంగా 8 ఏళ్ల వరకు సర్వీసు తీసుకొంటారు.
- భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే స్పౌజ్, పెళ్లికాని 40 ఏళ్లు పైబడిన మహిళలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 5 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.
- 40%-55% శారీరక వైకల్యం, 60%-70% వినికిడి లోపం ఉన్న వారికి 5 పాయింట్లు.
- 40% దృష్టి లోపం, 56%-59% శారీరక వైకల్యం ఉన్న వారికి ఏడు పాయింట్లు.
- స్కౌట్స్, గైడ్స్ యూనిట్‌ను రెండేళ్లుగా నిర్వహిస్తుంటే రెండు పాయింట్లు లభిస్తాయి.
- మొదటి ప్రాధాన్య క్యాటగిరీలో వందశాతం అంధత్వం, 80% వైకల్యం, రెండో క్యాటగిరీలో అంధత్వం 75%, వైకల్యం 70%-79% ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- వితంతువు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అనారోగ్యంతో ఆధారపడిన వారు ఉంటే అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ఎవరైనా హెచ్‌ఎం, టీచర్ తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినా క్యాటగిరీ-4కు బదిలీ చేస్తారు. అక్కడ 5/8 ఏళ్లు తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
ఏపీలో టీచర్ల బదిలీలు - ఈ నెల 15 నుంచి ప్రక్రియ మొదలు!
గుడ్ న్యూస్ - మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు! మార్గదర్శకాలు ఇవే