Government Employees Problems on YSRCP Region : గత ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని వేధించిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్య నారాయణ ధ్వజమెత్తారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ.25 వేల కోట్లకు పేరుకు పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉందని, అందుకే తమకు రావాల్సిన రూ.6200 కోట్లు చెల్లించిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులుగా తాము కూడా ఒత్తిడి చేయడం లేదని సూర్యనారాయణ స్పష్టం చేశారు. విశ్రాంత ఐఏఎస్‌తో కూడిన పీఆర్సీ వద్దని, సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు : గడిచిన 11 వేతన సవరణ సంఘాలు ఇచ్చిన నివేదికల్లో పేరు, తేదీ మినహా మరేమీ మారలేదన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారుల పునరావాస కేంద్రంగా మాత్రమే వేతన సవరణ సంఘం పరిమితం అవుతోందని వ్యాఖ్యనించారు. పీఆర్సీ ఇచ్చేంత వరకూ ఐ ఆర్ ప్రకటించాలని కోరుతున్నామన్నారు. కనీసం ఒక్క డీఏ అయినా ప్రకటించాలని విన్నవించారు. ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఓ యంత్రాంగం లేదన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వ్యవస్థ విఫలం అయ్యిందని భావిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ఫిర్యాదులు అసలు పరిష్కారం కావడం లేదని, కొందరు ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సీపీఎస్ విషయంలో ఓ స్పష్టత ఇవ్వాలి : చాలా మంది అగౌరవంగా, అహంభావంగా ప్రవర్తిస్తున్నారని కె.ఆర్ సూర్య నారాయణ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు ఉన్న ప్రవర్తనా నియమావళి ఉన్నట్టే ఐఏఎస్ అధికారులకు ఉందన్నారు. ఐఏఎస్ అధికారులు కింది సిబ్బందిని సహచరులుగా గుర్తించి ప్రవర్తించాలన్నారు. ఉద్యోగుల అంతా ప్రభుత్వానికి, ప్రజలకు మాత్రమే సేవకులు ఐఏఎస్ అధికారులకు కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగుల ట్రైబ్యునల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సంక్షేమంపై ఓ చట్టం, గత ప్రభుత్వం చేసిన జీపీఎస్ చట్టాన్ని అబేయన్సులో పెట్టలేదన్నారు. సీపీఎస్ విషయంలో ఓ స్పష్టత ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వం అరాచకానికి ఉద్యోగులు కూడా : గ్రామ వార్డు సచివాలయాల రేషనైలేజేషన్ పాలనాపరమైన అంశమని, ఆ ఉద్యోగుల సమస్యలకు అది పరిష్కారం కాదన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కె.ఆర్ సూర్య నారాయణ కోరారు. ఈ దస్త్రాలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్న ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది వెల్లడించాలన్నారు. అన్నింటికి దిగువ స్థాయి ఉద్యోగులనే బలి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అరాచకానికి ఉద్యోగులగా తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని వివరించారు.
ఐఏఎస్ అధికారుల ఇళ్లను ముట్టడిస్తాం : కొందరు ఐఏఎస్ అధికారుల ప్రవర్తన కారణంగా ఉద్యోగులకు ప్రభుత్వానికి ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగులు ఐఏఎస్ అధికారులకు సేవకులు కాదు సహచరులు మాత్రమే అని గుర్తించుకోవాలన్నారు. ఇష్టానుసారం మాట్లాడి ఉద్యోగులను వేధించే ఐఏఎస్ అధికారుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. ఉద్యోగులు, ఉన్నతాధికారుల మధ్య ఏకాభిప్రాయం వచ్చేలా ఓ చట్టపరమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ పెట్టిన పరిపాలనా ట్రిబ్యునల్‌ను గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే రద్దు చేసిందన్నారు. దానిని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుతోందని సూర్య నారాయణ వెల్లడించారు.
'సంతకాలు పెట్టేసి వెళ్లిపోతే ఎలా?' - ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్యులపై మంత్రి ఫైర్
ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది - ప్రభుత్వ ఉద్యోగుల కోసం రియల్ టైమ్ డ్యాష్ బోర్డు