Government Decides to Set up Regional Innovation Hub in Tirupati : ‘ఒక కుటుంబం, ఒక ఔత్సాహిక వ్యాపారవేత్త’ అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. అదేవిధంగా అంకుర పరిశ్రమలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలన్నది ఆయన ఆశయం. ఇందుకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు, యువతకు సాంకేతికంగా చేయూతనందించడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధంగా తిరుపతిలో ఓ విభాగాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. త్వరగా దీన్ని కార్యరూపంలోకి తేవాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ హబ్‌కు సహకారం అందించే పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమాలోచనలు జరిపారు.
ప్రధాన భాగస్వామిగా అదానీ సంస్థ : ప్రాంతీయ హబ్‌కు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రధానంగా పరిశ్రమల వర్గాలను ఇందులో భాగస్వాములుగా చేస్తున్నారు. నిధులను సైతం 50 శాతం ప్రభుత్వం మరో 50 శాతం సంస్థలు ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో నెలకొల్పే ప్రాంతీయ హబ్‌కు ప్రధాన భాగస్వామిగా అదానీ సంస్థ ఉంటుంది. సహాయకారులుగా నవయుగ, అమరరాజ కంపెనీలు వ్యవహరిస్తాయి. జ్ఞానపరమైన సాయం ఐఐటీ తిరుపతి అందిస్తుంది. క్షేత్రస్థాయిలో ఏవైనా అవరోధాలు ఎదురైతే జిల్లా ఇన్నోవేషన్ కౌన్సిల్ పరిష్కరిస్తుంది. దీనికి సంయుక్త కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. పరిశ్రమల శాఖ జీఎం, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, డీఆర్‌డీఏ, ఏపీఐఐసీ జడ్‌ఎం సభ్యులుగా ఉంటారు.
20వేల అంకుర పరిశ్రమలు : ప్రాంతీయ హబ్‌లో అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచనతో వచ్చే యువతను ప్రోత్సహిస్తారు. పరిశ్రమ స్థాపించడం మొదలు పేటెంట్లు పొందే వరకు సహకారం అందిస్తారు. సాంకేతిక పరిశోధనకూ సాయం చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20వేల అంకుర పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తిరుపతిలోని ప్రాంతీయ హబ్‌తో చిత్తూరు జిల్లానూ అనుసంధానం చేస్తారు.
రెండు నెలల్లో కార్యకలాపాలు : ప్రాంతీయ హబ్ శాశ్వత భవనాల నిర్మాణం, ప్రయోగశాల, తదితర అవసరాలకు ఐదు ఎకరాలు అవసరం. ఏడాదిలోగా వీటిని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈలోగా కేంద్రం నిర్వహణకు తాత్కాలిక భవనం గుర్తించాలని అధికారుల బృందం నాలుగైదు ప్రాంతాలను పరిశీలించింది. చివరకు ఐఐటీ తిరుపతి లేదా రేణిగుంటలోని ఏపీఐఐసీ భవనంలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇది కొలిక్కి వస్తే నెల, రెండు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ హబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తిరుపతి కలెక్టర్ వెంటటేశ్వర్ తెలిపారు. ఇందులో ఒకటి తిరుపతిలో నెలకొల్పుతారని గుర్తు చేశారు. యువత ఆలోచనలకు ఓ రూపమిచ్చి కార్యరూపం దాల్చే వరకు దోహదపడుతుందన్నారు. దీనికి సహకారం అందించాలని పరిశ్రమల వర్గాలతో సమీక్షించామని, వీలైనంత త్వరగా ప్రాంతీయ హబ్‌ను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
ఐటీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు
రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ హబ్ - ప్రభుత్వానికి APIIC ప్రతిపాదనలు