GODDESS TEMPLE UNDER RAILWAY TRACK: ఎక్కడైనా దేవాలయాలు నదీతీర ప్రాంతాలలో లేదంటే కొండలు, గుట్టల్లో ఉండటం సహజం. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే ట్రాక్ కింద అమ్మవారి ఆలయం ఉంది. ఇది ఎక్కడో కాదు తిరుపతి జిల్లాలోనే. దీనిని తీసివేయడానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ కొంచెం కూడా పక్కకు జరపలేకపోయారు. ఇంతటి శక్తివంతమైన అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతి జిల్లాలోని కరకంబాడీ నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో నేషనల్ హైవేకి పక్కనే ఈ అమ్మవారి ఆలయం వెలిసింది. సుమారు 700 ఏళ్ల కిందట కరకంబాడీ చెరువు కట్ట వద్ద ఉన్న పుట్టలో అమ్మవారు వెలిశారు. దీంతో ఈ అమ్మవారిని కట్టపుట్టాలమ్మగా భక్తులు కొలుస్తున్నారు. తొలుత బ్రిటీష్ కాలంలో రైల్వే ట్రాక్ వేసే సమయంలో అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. అంతే కాకుండా బ్రిటీష్ సిబ్బంది సైతం అనారోగ్యం పాలయ్యారు. దీని కారణంగా అప్పటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే ఉంచారని ఆలయ చరిత్ర చెబుతోంది.
ఇదీ కట్టపుట్టాలమ్మ చరిత్ర: కట్టపుట్టాలమ్మగా ఎన్నో ఎళ్లుగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. రేణిగుంట సంతకు ఒకరోజు మిరియాల బండ్లతో వెళ్తున్న రైతులకు అమ్మవారు వృద్ధురాలి రూపంలో కన్పించారని పలువురు చెప్తున్నారు. ఆ సమయంలో బస్తాలలో ఉన్నవి ఏంటి అని ఆ వృద్ధురాలి రూపంలో ఉన్న అమ్మవారు అడిగారు. వారు మిరియాలకు బదులు జొన్నలుగా చెప్పారు.
దీంతో ఆ రైతులు బండ్లతో పాటు సంతకు వెళ్లి చూసేసరికి అవి నిజంగానే జొన్నలుగా మారిపోయాయి. ఈ అద్భుతం అమ్మవారి మహత్యం వలనే జరిగిందని అర్థమైన రైతులు, ఆమెను మొక్కడంతో ఆ జొన్నలు తిరిగి మిరియాలుగా మారాయి. ఇక అప్పటి నుంచి ఈ ప్రదేశంలో అమ్మవారికి గుడి ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు కుమారస్వామి, మురుగ, గణేష్ తెలిపారు. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం కట్టపుట్టాలమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు.
మండుటెండల్లో జలసవ్వళ్లు - పర్యటకులను ఆకట్టుకుంటున్న తుంబురు తీర్థం
లవకుశులు శ్రీరామునితో యుద్ధం చేసిన పవిత్ర ప్రదేశం- 'శ్రీరామతీర్థం' విశిష్టత మీకు తెలుసా?