Hostels Issues in Hyderabad : హైదరాబాద్ నగరంలోని హాస్టళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. పలు హాస్టళ్లను తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాటికి భారీగా జరిమానాలు విధించడంతోపాటు వాటి కిచెన్లను సీజ్ చేస్తూ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే 100కుపైగా హాస్టళ్లను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు 12 హాస్టళ్లను మూసివేయించారు. 60కిపైగా హాస్టళ్లకు నోటీసులు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. అమీర్ పేట, ఖైరతాబాద్, అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్‌లోని ప్రాంతాల్లో రెండు రోజులుగా పుడ్ సేప్టీతోపాటు ఇతర శాఖలతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనేక ప్రైవేటు హాస్టళ్లు ఆహార భద్రత, పారిశుధ్ధ్యం, అగ్నిప్రమాద నివారణ సహా పలు నిబంధనలు పాటించడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాల తనిఖీల్లో తేలాయి.
హాస్టళ్ల యాజమాన్యం సెల్లార్లను, పార్కింగ్ ప్రాంతాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం, పెద్ద హోర్డింగ్‌లను ప్రదర్శించడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేయడం, నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేయడం, చిన్న గదుల్లో విద్యార్థులను పెట్టడం, సరిపోని మరుగుదోడ్లు లేకపోవడం, వీధుల్లో వ్యర్థాలను పారవేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట ప్రాంతాల్లో సుమారు 58 హాస్టళ్లను తనిఖీ చేసి 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న 5 హాస్టల్ కిచెన్ లను మూసివేయించారు.
జీహెచ్ఎంసీ 1955 చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తున్న హాస్టళ్లకు రూ.2 లక్షల 45 వేల 500 జరిమానా విధించారు. అలాగే ఎల్బీనగర్ జోన్‌లోని శ్రీనగర్ కాలనీ, లలిత నగర్, కూకట్ పల్లి జోన్‌లోని కేపీహెచ్‌బీ, మూసాపేట, వినాయక్ నగర్, పత్రికా నగర్లో నిర్వహించిన డ్రైవ్‌లో 42 హాస్టళ్లను తనిఖీ చేశారు. 33 హాస్టళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి రూ.1 లక్ష 81 వేల జరిమానా విధించారు. 7 హాస్టల్ కిచెన్లను మూసివేయించారు. హాస్టల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ హాస్టళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిర్లక్ష్యంగా హాస్టళ్లు నడుపుతున్న వారిపై చర్యలు : ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా కొనసాగుతాయని, ఇప్పటికే నోటీసులు అందుకున్న యజమానులు తమ హాస్టళ్లలో నిబంధనల ప్రకారం నాణ్యత, భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చాలని, ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ప్రైవేటు హాస్టళ్లను నడుపుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
హాస్టళ్లు ఎక్కడున్నాయో తెలియట్లేదా? - ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి లిస్ట్ మీ చేతుల్లో
లగేజ్ బ్యాగ్‌లో లవర్- బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్తూ అడ్డంగా బుక్!