Food Testing Centers In Hyderabad : రుచికరమైన వంటలకు హైదరాబాద్ చిరునామా. దేశ విదేశాల నుంచి ఎవరొచ్చినా బిర్యానీ, ఇతర వంటలు రుచి చూసి సంతోషంగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధాని కేంద్రంగా రుచితో పాటు శుచికరమైన ఆహారాన్ని హామీగా అందించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖతో కలిసి నగరంలో ఐదు కొత్త ఆహార పరీక్ష కేంద్రాలు నెలకొల్పేందుకు కమిషనర్ ఇలంబర్తి నిర్ణయించారు. జోనల్ కమిషనర్లు స్థలాలను గుర్తిస్తున్నారు. ఆయా కేంద్రాలు అందుబాటులోకి వస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు పెరగనున్నాయి.
జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం నుంచి పని చేస్తున్న ఆహార భద్రత విభాగాన్ని తాజాగా ఆరోగ్య శాఖ కమిషనర్ వికేంద్రీకరించారు. ఐదుగురు జోనల్ కమిషనర్లకు ఇన్‌ఛార్జి డిజిగ్నేటెడ్ అధికారి హోదాను కేటాయించి, ఆహార భద్రతాధికారులు వీరి కింద పని చేసేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. వారి ఆధ్వర్యంలో లైసెన్సుల జారీ, ఐదు కేంద్రాలు నిర్మించాలని కమిషనర్ లక్ష్యం నిర్దేశించారు.
మూడు రకాలుగా పరీక్షలు :
వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాకేజీల్లోని పదార్థాల నమూనాలను సేకరించి అవి ప్రమాణాల మేరకు ఉన్నాయా, లేదా అని తెలుసుకునేందుకు పరీక్షలు ఉపయోగపడతాయి.
- రసాయనాలు : తృణధాన్యాలు, పప్పులు, నూనెలు, కొవ్వు పదార్థాలు, ఆకులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, పాలు, డెయిరీ వస్తువులకు రసాయన పరీక్షలు జరిపి, వాటిలో కలిసిన రసాయనాలు, ఇతరత్రా లోపాలను అధికారులు పరీక్షిస్తారు.
- కల్తీ జరిగిందా : ప్యాకేజీల్లోని పదార్థాలు, పచ్చళ్లు, సుగంధద్రవ్యాలు, శీతల పానియాలు, సీసాల్లోని నీరు కల్తీకి గురయ్యాయా పరీక్షలు నిర్వహించి తెలుసుకుంటారు.
- క్రిములు ఉన్నాయా? : ప్యాకేజీల్లోని పదార్థాల్లో వ్యాధికారక క్రిములు లేదా సూక్ష్మజీవులు ఉన్నాయా అని పరీక్షల్లో తెలుస్తుంది.
హైదరాబాద్‌లో వివరాలు ఇలా | |
ఆహార భద్రతాధికారులు | 22 |
ప్రస్తుతం ఉన్న పరీక్ష కేంద్రాలు | 1 (రాష్ట్రం మొత్తానికి) |
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలు | 25,000 |
ప్రస్తుతం ఆహార నమూనాల పరీక్షల ఫలితాలు రావాలంటే | 30 నుంచి 60 రోజులు |
కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే | 7 నుంచి 14 రోజులు |
ఐదు కేంద్రాలకు కానున్న ఖర్చు | రూ.30 కోట్లు ( ఒక్కోదానికి రూ.6 కోట్ల చొప్పున) |
కేంద్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విస్తీర్ణం | 6,000 చదరపు అడుగుల నుంచి 10వేల చ.అ |
'గ్రీజు'లా మారిన వంట నూనె - తినడానికి పనికిరాని మాంసం - ఆ హోటళ్లలో ఇవే వాడుతున్నారట!
అదిరే రుచి - నాణ్యత ఛీ.. ఛీ.. - బయట తినాలంటేనే వణికిపోతున్న నగరవాసులు