Getting Govt Jobs With False Documents : తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి తమ వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న వైనం బహిర్గతమైంది. కరీంనగర్ జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. వాటిలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రభుత్వశాఖల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. కాగా విచారణ నిర్వహిస్తున్న అధికారులపై నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇలా చేసి ప్రభుత్వం ఉద్యోగం పొంది : ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు ఇంకా ఆరేళ్లు ఉంది అనగా దీర్ఘకాలిక సెలవు తీసుకుంటారు. తర్వాత కొన్ని నెలలు అనారోగ్య కారణాలతో వివిధ చికిత్సలు పొందినట్లు ఆసుపత్రుల వైద్య పరీక్షలు, వాడిన మందులతో పాటు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులచే ధ్రువీకరించిన పత్రాలు తీసుకుంటారు. వీటితో తమ వారసుడికి ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటారు. దీనికి కలెక్టర్ ఛైర్మన్‌గా ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులతో కూడిన కమిటీ పరిశీలిస్తుంది. వీరంతా ఆర్జీ పెట్టుకున్న ఉద్యోగి పని చేయడని నిర్ధారించాలి. అప్పుడు కలెక్టర్ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రభుత్వంలోని జీవో ఆధారంగా ఏళ్ల తరబడి చాలామంది ఇలా ఉద్యోగాలు పొందారు.
ఎలా బయటపడింది : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి పశువైద్యశాలలో పనిచేస్తున్న కొమురయ్య తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని, తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఆరు నెలల క్రితం వైద్యుల ధ్రువీకరణ పత్రాలతో ఆర్జీ పెట్టుకున్నాడు. దీనిపై పలుసార్లు కమిటీ పరిశీలించి, వైద్యుల ధ్రువీకరణ తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక బృందంచే విచారణ చేపట్టారు. వారు కొమురయ్య సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రహస్యంగా విచారణ చేశారు.
అందులో వైద్యులు, వారి డిగ్రీలు, ఆసుపత్రి లోగో, ఐఎంఏలో వైద్యుల వివరాలు అన్నీ తప్పుగా ఉన్నాయని గుర్తించారు. బృందం నివేదిక ఆధారంగా పోలీసులు వైద్యుడు కొమురయ్యపై కేసు నమోదు చేశారు. ఇదే తరహా వ్యవహారంలో బుధవారం ఇల్లంతకుంట పశువైద్యశాలలో పనిచేస్తున్న దేవమ్మపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ ముఠాతో సంబంధం : వారసులకు ఉద్యోగాలు ఇప్పించేవారికి తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలు జారీచేసే రెండు ముఠాలు కరీంనగర్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరు స్థానిక ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు మొదలు, ఉస్మానియా ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లోని వైద్యులు ధ్రువీకరించినట్లు పత్రాలు సృష్టిస్తారు. దీనికి ఒకొక్కరి నుంచి రూ.3.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ముఠాలకు హైదరాబాద్‌కు చెందిన మరో ముఠాతో సంబంధాలు ఉంటాయి.
వీరు ఒకొక్కరి నుంచి రూ.2 లక్షల వసూలు చేస్తారు. ఇలా నెలలో సగటున 30 వైద్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్ కేంద్రంగా ఈ దందా నిర్వహించే వారిలో ఓ విశ్రాంత తహసీల్దార్, రెవెన్యూశాఖలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్‌లు ఉన్నట్లు ప్రత్యేక బృందం విచారణలో గుర్తించారు.
'ఆల్ ఇన్ వన్ రామ్' సలహాలు వింటున్నారా - అయితే మీ ఆరోగ్యం ఒకసారి చెక్ చేసుకోండి!
Fake Doctor: నాలుగేళ్లలో 43 వేల మందికి ‘వైద్యం’
ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్.. కట్ చేస్తే జైల్లో ఊచలు లెక్కపెడుతూ..