Gazette issued for National Highway 165 Land Acquisition : ఆకివీడు - దిగమర్రు 165 జాతీయ రహదారికి మరో ముందడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు మండలాల్లో 20 గ్రామాల మీదుగా భూసేకరణకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే జాయింట కలెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది. దీంతో దాదాపు మూడేళ్ల పాటు కోర్టు కేసులతో నిలిచిపోయిన జాతీయ రహదారి విస్తరణ, భీమవరం బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
వారి చొరవతోనే : గత టీడీపీ హయాంలో పామర్రు నుంచి ఆకివీడు మీదుగా దిగమర్రు వరకు జాతీయ రహదారి మంజూరైన సంగతి తెలిసిందే. తొలిదశలో పామర్రు నుంచి ఆకివీడు వరకు 64 కిలోమీటర్ల రహదారి రెండు వరుసలుగా విస్తరణ పనులు చేశారు. అది ముగింపు దశకు చేరుకుంది. ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం నెలకొంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కీలక భూమిక పోషించే రహదారి సమస్యను గత అయిదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చొరవతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. రెండో దశ జిల్లాలో 61.740 కి.మీ. నుంచి 107.660 కి.మీ. వరకు ఆకివీడు-దిగమర్రు వరకు 45.92 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆరు మండలాలు - 20 గ్రామాలు : గతంలో రెండు, మూడు ప్రతిపాదనలు చేసినా చివరిగా ఆకివీడు మండలంలో అజ్జమూరు నుంచి ఉండి మండలంలో చెరువుకువాడ, పెదపుల్లేరు, చినపుల్లేరు, పాలకోడేరు మండలంలో విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం మండలంలో వీరవాసరం, భీమవరం మండలంలో చిన అమిరం, రాయలం, తాడేరు, భీమవరం, గునుపూడి, కాళ్ల మండలంలో కొలనపల్లి, సీసలి, జక్కరం, పెద అమిరం, వేంపాడు, కోపల్లె గ్రామాల మీదుగా వెళ్లే ప్రతిపాదనను ఆమోదించారు.
ఆయా గ్రామాల్లో 172.9235 హెక్టార్లలో భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది పూర్తయితే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల రహదారులు ఇరుకుగా ఉండటంతో అవి విస్తరణ జరిగి రాకపోకలు సునాయాసమవుతాయి. రవాణాతో పాటు వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను వేగంగా రవాణా చేసే అవకాశం ఉంటుంది. భూసేకరణ పూర్తయిన తర్వాత డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని జాతీయ రహదారి శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కాజా మొహిద్దీన్ తెలిపారు.
పోర్టుల అనుసంధాన రోడ్లకు మహర్ధశ - వెయ్యి కోట్లతో పనులకు ప్రణాళిక