Gannavaram TDP Office Attack Case Update : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను అపహరించి, దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారైన సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారివీధి నుంచే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, భయపెట్టారని కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్‌పై సంతకాలు చేయించుకున్నారని తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబసభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారని తర్వాత సత్యవర్ధన్‌ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్‌లోని మై హోమ్ భూజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారని వివరించారు. ఆ రాత్రంతా సత్యవర్ధన్‌ను చిత్రహింసలు పెట్టారని అనంతరం ఆయన్ను పొట్టి రాము, వేల్పూరి వంశీ, ఎం.వేణులు ఏపీ 40బీజీ 5005 నంబరు క్రెటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారని తెలిపారు. 12న అక్కడ హోటల్ చందనలో సత్యవర్ధన్‌ను నిర్బంధించి తర్వాత చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారని పేర్కొన్నారు. అతనితో పాటు నిందితులు తేలప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని సత్యవర్ధన్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని వెల్లడించారు.
వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ
పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయని కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని వంశీ ఉంటున్న మైహోమ్ భూజా అపార్ట్‌మెంట్‌లోకి ఏపీ40 బీజీ 5005 వాహనం ఫిబ్రవరి 11న అర్ధరాత్రి 12.01 గంటలకు వెళ్లడం రికార్డయిందని రెండు నిముషాల తర్వాత లిఫ్ట్‌లో సత్యవర్ధన్‌ను వంశీ ఫ్లాట్‌కు అతని అనుచరులు తీసుకొచ్చారని తెలిపారు.
విశాఖలోని బే ఫ్రంట్ జ్యువెల్ అపార్ట్‌మెంట్, చేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లోనూ సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని వీటితో పాటు విజయవాడ- హైదరాబాద్ మార్గంలోని పలు టోల్‌గేట్లలోని సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ సత్యవర్ధన్‌ను అపహరించి తీసుకెళ్తున్న కారు కనిపించిందని ఆధారాలతో సహా పేర్కొన్నారు.