Ganja in The Form Of Chocolates : గంజాయి, మత్తు పదార్థాలను వేటాడుతున్న ఆబ్కారీ తనిఖీ బృందాలకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ దగ్గర పొడి గంజాయి దొరికితే, మరోచోట గంజాయితో తయారైన చాక్లెట్లు పట్టుబడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయికి అధిక గిరాకీ, తరలించేందుకు అనువైన మార్గం భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు కావడంతో అక్రమార్కులు ఇక్కడి దారులను ఎంచుకుంటున్నారు. కొందరు పట్టుబడుతున్నారు. ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం భద్రాచలం గోదావరి వంతెన వద్ద ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇక్కడ ఆబ్కారీ శాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది. ఆబ్కారీ అధికారులు కాస్త ఆదమరిచిన సందర్భాలను, అక్రమార్కులు గంజాయి రవాణాకు ఉపయోగించుకుంటున్నారని సమాచారం.
ఇటీవల కాలంలో గంజాయి చాక్లెట్లు విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి. ఒడిశాలో తయారవుతున్నట్టుగా చెబుతున్న ఈ చాక్లెట్లను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అనేక చోట్ల అమ్ముతున్నారని ఆబ్కారీ శాఖ గ్రహించింది. తనిఖీలను విస్తృతంగా చేపడుతోంది. రైలు మార్గం ద్వారా చాక్లెట్లు చేరుతున్నాయనే విషయాన్ని కొన్ని కేసులు నిరూపించాయి. ఆర్పీఎఫ్‌తో కలిసి రైళ్లలో ఆబ్కారీశాఖ సోదాలు చేస్తోంది. ఖమ్మం గ్రామీణ మండలంలో ఇటీవల 26 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనపరచుకున్నారు. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఉన్నాయి. ఇలాంటి చాక్లెట్లు ఖమ్మం నగరంలో గుట్టుచప్పుడు కాకుండా భారీగా అమ్ముడుపోతున్నాయని తనిఖీ బృందాలు నిర్ధారించుకున్నాయి.
చాక్లెట్లుగా సరఫరా : కొద్దినెలలుగా ఈ కోణంలో తనిఖీలు జరుగుతున్నా మూల సరఫరాదారుల ఆచూకీ చిక్కటం లేదు. జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం కొద్దిరోజుల క్రితం బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలో 77 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొంది. ఇక్కడ అదుపులోకి తీసుకున్న నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్ర వరకు గంజాయి, చాకెట్లు సరఫరా అవుతున్న అంశం వెలుగు చూసింది. రైళ్లల్లో తనిఖీలపైనా ఆబ్కారీశాఖ అధిక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా యువత కొత్తగా ఇచ్చే చాక్లెట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, పెద్దలు కూడా ఓ కంట కనిపెడుతు ఉండాలని ఆబ్కారీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.