Gaddar Telangana Film Awards Ceremony : రాష్ట్రంలో పదేళ్ల తర్వాత సినీ సంబురాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
అలాగే గద్దర్ అవార్డులకు ఎంపికైన విజేతలతో పాటు జ్యూరీ ఛైర్మన్లు జయసుధ, మురళీమోహన్ సహా పలువురు అగ్రతారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారనుంది. సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా మరుగునపడిన అవార్డులను గతేడాది నుంచి పునః ప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా పదేళ్ల అవార్డులను సైతం ప్రకటించి చిత్ర పరిశ్రమలోనూ, నటీనటుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది.
గద్దర్ అవార్డుల ప్రకటన వివరాలు : 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కీకి ఆ చిత్ర హీరో ప్రభాస్‌తో పాటు కీలక పాత్రలో నటించిన బిగ్ బీ అమితాబచ్చన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ గద్దర్ అవార్డులు అందుకోనున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును స్వీకరించబోతున్నారు. ఉత్తమ నటిగా 35 చిత్రానికి నివేదా థామస్ గద్దర్ తెలంగాణ పురస్కారాన్ని అందుకోనుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, చారిత్రక విభాగంలో హెరిటేజ్ చిత్రంగా రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్, ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథకాదు చిత్ర బృందం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నాయి. మిగతా విభాగాల్లో అవార్డులకు ఎంపికైన విజేతలకు అతిథులు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
పదేళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుల పేరుతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరు ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బీఎన్ రెడ్డి అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచందర్ రావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులతో ప్రభుత్వం సత్కరించనుంది.
పటిష్ఠ బందోబస్తు : ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర అతిథులు హాజరుకానున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా హైటెక్స్ వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్డీసీ జారీ చేసిన పాసులున్న వారినే వేడుకలకు అనుమతించనున్నారు.
బెస్ట్ మూవీస్‌గా బలగం, బాహుబలి 2, RRR- బాలయ్యకు NTR నేషనల్ ఫిల్మ్ అవార్డ్