MLA Maganti Gopinath Funeral : గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు. తుది వీడ్కోలుకు తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు నివాళులర్పించారు.
భావోద్వేగానికి గురైన మాజీ సీఎం కేసీఆర్ : ఎర్రవల్లి నుంచి మాదాపూర్‌లోని గోపినాథ్ నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోపినాథ్ భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న గోపినాథ్ కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపినాథ్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు.
నివాళులర్పించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ : ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి సహా ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు మాగంటికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమయాత్రగా తీసుకొచ్చిన మాగంటి భౌతిక కాయానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్‌రావు పాడె మోశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తండ్రి చితికి కుమారుడు వాత్సల్య నిప్పటించారు. కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య మాగంటికి తుది వీడ్కోలు పలికారు
ఈనెల 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఉదయం 5.45 నిమిషాలకు కన్నుమూశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన గోపీనాథ్ మరణ వార్తతో మాదాపూర్‌లోని స్వగృహానికి వచ్చిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు గోపినాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం
LIVE UPDATES : మహాప్రస్థానంలో ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు