Kamineni Hospital in Hyderabad : తల్లిదండ్రుల్లో ఎవరికైనా తలసీమియా మైనర్ ఉంటే, పిల్లలకు తలసేమియా మేజర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు తెచ్చే ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే, ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించుకోవడం, మందులు వాడడం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, పిల్లలకు తలసేమియా సంబంధిత పరీక్షలు చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న కామినేని ఆసుపత్రిలో ఉచిత హెమటాలజీ శిబిరం నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, హెమటాలజిస్టు, జెనెటిక్ వైద్య నిపుణులు పాల్గొని పిల్లలకు పలు పరీక్షలు చేస్తారు. ఈ శిబిరంలో పాల్గొని, ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని 8985450534 అనే నంబరులో సంప్రదించవచ్చు.
ఈ సందర్భంగా పిల్లల వైద్య విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డా. ఎస్. నరసింహారావు మాట్లాడుతూ, పిల్లలు ఎప్పుడూ అలసటగా, బలహీనంగా కనపడుతున్నా, ముఖం పసుపు లేదా తెల్లగా మారినా, ఎదుగుదల ఆలస్యంగా అనిపిస్తున్నా, పొట్ట ఉండాల్సిన దానికంటే పెద్దగా కనిపించినా, ముఖం ఎముకల ఆకృతి అసాధారణంగా మారినా, తరచు జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు వస్తున్నా, మూత్రం ముదురు రంగులో ఉంటున్నా వెంటనే తల్లిదండ్రులు గమనించి తలసేమియా సంబంధిత వైద్య పరీక్షలు చేయిచాలని ఆయన సూచించారు.
ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స ప్రారంభిస్తే పిల్లల ప్రాణాలు కాపాడగలమని చెప్పారు. ఈ సమావేశంలో కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ కంచన్ ఎస్. చన్నావర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా.జయంతి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ డా.ఎం.శ్రీనివాస్, జెనెటిక్, మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డా.అనీ క్యూ హసన్ పాల్గొన్నారు.
అలాగే జెనెటిక్స్ కౌన్సిలర్ డాక్టర్ శ్రీలత కొమాండూర్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.వివేకానంద్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అన్నే పునీత్ బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ పూర్తి ఉచితంగా హెమోగ్లోబిన్, హెమోగ్లోబినోపతి స్క్రీనింగ్(హెచ్పీఎల్సీ) పరీక్షలు చేస్తారు.
పిల్లల్లో "మలబద్ధకం" సమస్య! - ఈ టిప్స్ పాటిస్తే ఫలితం ఉంటుందంటున్న నిపుణులు
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దంటున్న నిపుణులు!