Free Gas Cylinder Scheme: దీపం-2 పథకంలో భాగంగా మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఇప్పటి వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చే ఈ స్కీమ్‌ను గతేడాది చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్ నుంచి జులైౖ, ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబరు నుంచి మార్చి మధ్యలో, అంటే నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
ఇలా పొందొచ్చు: రేషన్‌కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులంతా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హత ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. బ్యాంకు అకౌంట్ యాక్టివ్‌లో లేకుంటే వెంటనే పునరుద్ధరించుకోవాలి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంతో ఎక్కువ శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. పలువురికి సాంకేతిక కారణాలతో డబ్బులు అకౌంట్లో పడలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలి ఫ్రీ గ్యాస్ సిలిండరు పొందని వారు ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గతేడాని దీపావళి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం-2) పథకాన్ని ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అధిక సంఖ్యలో లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. గ్యాస్ తీసుకున్న అనంతరం వారి అకౌంట్లలో 48 గంటల్లోపే డబ్బులు జమ చేశారు.
ఏపీలో దీపం 2 కింద ప్రారంభమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి తొలుత రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతేడాది నవంబర్ లెక్కల ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌కు అర్హత పొందాయి. కొంతమంది ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అనుసంధానం లేకపోవడం వలన లబ్ధిదారుల సంఖ్య అప్పట్లో తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు.
'ఉచిత గ్యాస్'కి సూపర్ రెస్పాన్స్ - మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారా?