Free Coaching For Civil Services 2026 Aspirants : బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు వచ్చే నెల 25 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు 150 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు జూన్ 16 నుంచి జులై 8 వరకు https://tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ కాలనీలో బీసీ స్టడీసర్కిల్‌లో శిక్షణ ఉంటుందని, ప్రవేశం పొందిన వారికి వసతి, రవాణా కోసం నెలకు రూ.5,000 స్టైపెండ్ ఇస్తామని తెలిపారు. వంద మంది అభ్యర్థులను వచ్చే నెల 12న నిర్వహించే ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని అన్నారు. మరో యాభై సీట్లను గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తామని, ఆయా అభ్యర్థులు నేరుగా స్టడీసర్కిల్ ఆఫీస్‌లో సంప్రదించాలని అన్నారు. మరిన్ని వివరాలకు 040-24071178 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
జూన్ 14 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి : సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2026 కోసం రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీసర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ తెలిపింది. తెలంగాణకి చెందిన అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా జూన్ 14 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రవేశ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదని తెలిపింది. మరిన్ని వివరాలకు 6281766534 నంబర్లో సంప్రదించాలని సూచించింది.
ప్రధాన పరీక్షలకు 31 మంది ఎంపిక యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ స్టడీసర్కిల్ అభ్యర్థులు మెరుగైన ప్రతిభ చూపారని ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ చెప్పారు. సివిల్స్ ప్రిలిమినరీలో 26 మంది, అటవీ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఐదుగురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.