Investment Scam in Hyderabad : కాలనీలో ఉంటాడు. ఖరీదైన కార్లలో తిరుగుతాడు. ఆర్భాటంతో ఎప్పుడూ పదిమంది వెంట ఉంటారు. ఏ పండుగ జరిగినా ఊరేగింపు నిర్వహించినా చందాలు ఇస్తాడు. ఇది అంతా బయటకు కనిపించే ఓ దర్పం మాత్రమే. ఈ నమ్మకాన్నే ఆదాయాన్ని మలచుకునేందుకు చేసే ప్రయత్నం అని గుర్తించేలోపు రూ.కోట్లు కాజేసి ముఖం చాటేస్తాడు. ఇదీ హైదరాబాద్ మహానగరంలో మాయగాళ్ల కొత్త ట్రెండ్.
గొలుసుకట్టు మోసాలు : విదేశీ కంపెనీలు, స్టాక్ మార్కెట్, స్థిరాస్తి రంగం అన్నింటా తామే అంటూ మాటలతో మభ్యపెడుతూ అమాయకులను నిండా ముంచుతున్నారు. తాజాగా మలక్‌పేటకు చెందిన ఇద్దరు మిత్రులు, తమ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు వస్తాయంటూ స్థానికంగా ఊదరగొట్టి రూ.50 కోట్ల మేర వసూలు చేశారు. మూడు సంవత్సరాలు సాగిన ఈ దొంగాట సీసీఎస్ పోలీసుల రంగ ప్రవేశంతో వెలుగుచూసింది. ఇదే తరహాలో హైదరాబాద్ నగర శివారున గొలుసుకట్టు మోసాలకు వేలాది మంది బలి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఎలా మోసం చేస్తారంటే? : పెద్ద ఎత్తున కమీషన్ ఆశ చూపి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రచారం చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు. ఉక్కు, బంగారం, స్టాక్ మార్కెట్, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులతో రాత్రికి రాత్రే తలరాత మార్చుకోవచ్చని నమ్మబలుకుతున్నారు. ఖరీదైన హోటళ్లలో మీటింగ్ లు ఏర్పాటు చేస్తారు. తమ ఏజెంట్లనే సభ్యులుగా చూపుతున్నారు. ఇదంతా నిజం అని నమ్మి సభ్యులుగా చేరుతున్నారని ఓ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఇప్పుడు బంగారం రేటు పెరగటంతో స్త్రీలను ఆకట్టుకునేందుకు గోల్డ్ స్కీమ్ పేరిట ఒక ముఠా నగదు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లాభాల వల : గత సంవత్సరం ఓ మోసగాడు వెల్‌నెస్ సెంటర్లలో సభ్యులుగా చేరమంటూ వందలాది మందితో పెట్టుబడులు పెట్టించాడు. లావాదేవీల్లో ఎక్కడా తన పేరు రాకుండా కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్ ఉపయోగించాడు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నిందితుల్లో ఎక్కువ శాతం స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అందరికి కనిపిస్తారు. సంస్థలో చేరిన సభ్యులకు 4,5 నెలలు చెప్పినట్టు కమీషన్, లాభాలు అకౌంట్లో జమ చేస్తారు. నూతన సభ్యులను చేర్పించిన వారికి బోనస్‌గా రెట్టింపు కమీషన్ ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. పెద్ద మొత్తంలో నగదు చేతికి వచ్చాక ముఖం చాటేస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం - పెట్టుబడుల పేరుతో రూ.150 కోట్లు స్వాహా
విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం - అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు!