Fraud in The Name Of Marriage : భార్య లేని ఒంటరి వృద్ధులే వారి టార్గెట్. పెళ్లి పేరిట వలపు వల విసిరి భారీగా డబ్బులను గుంజుతున్న ఇద్దరు మహిళల మోసాల గుట్టును హైదరాబాద్ మహంకాళి పోలీసులు రట్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరేళ్లలో 100 మందికిపైగా వృద్ధులను మోసగించినట్లు నిందితుల కాల్‌డేటా ఆధారంగా ఓ అంచనాకు వచ్చారు.
పెళ్లిళ్ల దొంగాట : వివరాల్లోకి వెళితే నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలనీ అడ్డాగా ఇద్దరు మహిళలు అడ్డదారిలో డబ్బు సంపాదనకు 2019లో నకిలీ మ్యారేజ్‌బ్యూరోను ఏర్పాటుచేసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరుకు చెందిన తాయారమ్మ అలియాస్ సరస్వతి భర్త ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసేవారు. రిటైర్డ్‌మెంట్‌కు ముందు సస్పెండ్ కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో హైదరాబాద్ నగరానికి చేరారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వాసి స్వాతి భర్త, ఇద్దరు పిల్లలతో అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ‘పెళ్లిళ్ల దొంగాట’ను ప్రారంభించారు.
వారిలో ఒకరిని వితంతు మహిళగా పేర్కొంటూ మ్యారేజ్‌బ్యూరో పేరిట ప్రకటనలు ఇచ్చేవారు. వయస్సుతో సంబంధం లేదని తనను ప్రేమగా చూసుకుంటే చాలంటూ ఫోన్‌చేసిన వారిని మభ్యపెట్టేవారు. పెళ్లికి సిద్ధమైన వృద్ధులను నగరానికి రప్పించి షాపింగ్ మాల్స్, వస్త్ర, పసిడి దుకాణాలకు తిప్పి డబ్బులను కాజేసేవారు. ఉద్యానవనాల్లో పెళ్లిచూపుల తంతు ముగించేవారు. శివారుకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి 5 ఏళ్ల క్రితం భార్య చనిపోగా కుమారుడితో కలసి ఉంటున్నారు. నిందితులు ఇచ్చిన ప్రకటనకు ఆకర్షితుడై వారిని ఫోన్‌లో సంప్రదించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచి : అనంతరం వారిలో ఓ మహిళ సూచనతో వారిద్దరూ ఓ పార్కులో కలుసుకున్నారు. మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించిన ఆమె చనువు పెరిగాక ఆభరణాలు, చీరలు, కుటుంబ అవసరాలంటూ దఫాలవారీగా రూ.14 లక్షలు బ్యాంకు అకౌంట్లోకి జమ చేయించుకొని ముఖం చాటేసింది. అతను పెళ్లెప్పుడని అడిగితే వేధిస్తున్నావంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించడంతో మౌనంగా ఉండిపోయారు. ఇదేరీతిలో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మరో వృద్ధుడు కూడా మోసపోయారు. నిందితులు అతనితో ఫోన్‌లో తీయగా మాట్లాడి మాయమాటలు చెప్పి దిల్‌సుఖ్‌నగర్ రప్పించారు. ఒకరు పెళ్తికుమార్తెగా, మరొకరు బ్రోకర్‌లా నటించారు. కొత్త వస్త్రాలు తీసుకుందామని దుకాణానికి తీసుకెళ్లి రూ.40 వేల దుస్తులు కొనిపించారు. మండపం, భోజన ఖర్చులంటూ మరో 20 వేల రూపాయలు కాజేశారు. తర్వాత పెళ్లి మాటెత్తితే జైలు ఊచలు తప్పవని నిందితులు బెదిరించడంతో బాధితుడు నోరు మెదపలేదు.
రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి (80)ని ఇదేతరహాలో నగరానికి రప్పించిన నిందితులు రూ.1.77 లక్షల విలువైన వస్తువులు, తాళిబొట్టు కొనుగోలు చేసి పరారయ్యారు. అయితే బాధితుడి ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ సైదయ్య పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ పరశురామ్, ఎస్సై పరదేశి జాన్ దర్యాప్తును చేపట్టారు. ఓ నిందితురాలి కుమారుడు హత్యకేసులో ఉన్నట్లు క్లూ లభించగానే అతని సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కిలేడీలను ఇటీవల అరెస్ట్ చేశారు. నిందితుల కాల్‌డేటా ఆధారంగా బాధితులకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించినప్పటికీ ఈ వయసులో పరువు పోతుందంటూ వెనకడుగు వేశారని పోలీసులు తెలిపారు.
ఆనవాళ్లు దొరక్కుండా! : నిందితులు వారి సిమ్‌కార్డులను మార్చేవారు. విశ్రాంత ఉద్యోగులు, బాగా డబ్బున్న వారిని బుట్టలో వేసేవారు. నేరుగా డబ్బు తీసుకోకుండా దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక మనీట్రాన్స్‌ఫర్ ఏజెన్సీ ద్వారా బాధితుల నగదును కాజేసేవారు. బంగారు తాళిబొట్టు, నగలు మరోచోట అమ్మి సొమ్ము చేసుకుని సమంగా పంచుకునేవారు.
80 ఏళ్ల వయసులో తోడు కోసం వృద్ధుడి ప్రకటన - పెళ్లికి ఓకే చెప్పిన ఇద్దరు మహిళలు - చివర్లో ట్విస్ట్!