SUN STROKE IN TELANGANA : రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడనంతో గత వారం చల్లగా ఉన్నా.. సోమవారం నుంచి నిప్పుల వర్షం మొదలైంది. సూర్యుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. నిన్న వడదెబ్బ తగిలి నలుగురు మృతి చెందారు. వీరిలో ఖమ్మం జిల్లా వాసులు ఇద్దరు, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మేడి ఎర్రముత్తయ్య(76) వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందారు. ఇదే జిల్లాకు చెందిన పెనుబల్లి మండలం కందిమళ్ల వారి బంజర్‌కు చెందిన వంటమేస్త్రీ తుమ్మలపల్లి సత్యనారాయణ(43) ఈ నెల 21న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వంట చేసేందుకు వెళ్లి వడదెబ్బ బారిన పడి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.
తోటకు వెళ్లి మృతి : జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మర్రిపెల్లి అర్వింద్(19) సోమవారం మామిడి తోటకు నీరు పెట్టేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్లకు చెందిన పాత భూమయ్య(58) సైకిల్‌పై తిరుగుతూ చింతగింజలు, చింతపండు, ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం సైకిల్‌పై వెళుతూ వడదెబ్బ తగిలి పడిపోగా ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడని స్థానికులు చెప్పారు.
ఈ 3 రోజులు గండమే : మరోవైపు రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. వడగాలుల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ఇవాళ, రేపు, ఎల్లుండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు 24, 25 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
"వచ్చే 3 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతం నుంచి వడగాలులు వీస్తాయి. కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాము. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడం మంచిది" - ధర్మరాజు, వాతావరణ శాఖ అధికారి
మధ్యాహ్నం వేళ బయటకు రాకండి - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
భానుడి భగభగలు - ఆ టైమ్‌లో పిల్లలను బయటకు పంపొద్దంటున్న వైద్యులు
చెమట ఎక్కువగా పడుతోందా? - ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే అంతా సెట్!