4 Nabbed For Attack On Chilkur Balaji Temple Priest : చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి ఘటన కేసులో ముగ్గురు మహిళలు సహా 4 నిందితులను శుక్రవారం మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన జి.రమాదేవి, ఏ.రాజ్యలక్ష్మి, బి.మూకాంబిక, విశాఖ నివాసి సి.జగదీశ్ ఉన్నారు. ఇటీవల రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి అనుచరులతో కలిసి చిలుకూరు బాలజీ ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడికి పాల్పడటం రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.
వీరరాఘవరెడ్డి ఉచ్చులో పేదింటి ఆడబిడ్డలు : తమ సంస్థలో సభ్యులను చేర్పించాలని, నిధులు అందించాలంటూ దూషిస్తూ రంగరాజన్‌ను నేలమీద కూర్చోబెట్టి బెదిరించటం, దాడికి దిగటం లాంటి దృశ్యాలను వీడియో తీశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో నలుగురి అరెస్ట్‌లతో ఆ సంఖ్య 18కి చేరింది.
పరారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కోసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ సంస్థను ఏర్పాటు చేసిన వీరరాఘవరెడ్డి, తొలి దశలో 5,000 మందిని సభ్యులుగా చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ప్రతి నెలా రూ.20,000 వేతనం, ఉచిత భోజన, వసతి ఏర్పాట్లు అనగానే ఎంతోమంది ఇతడి ఉచ్చులో చిక్కారు. పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలు ఇతడి మాటలకు ప్రభావితమై సంస్థలో సభ్యులుగా చేరారు.

కస్టడీ విచారణ సోమవారానికి వాయిదా : ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి కోరుతూ పోలీసులు రాజేంద్రనగర్ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే రంగరాజన్‌తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రంగరాజన్‌ను పరామర్శించారు.
రంగరాజన్‌పై దాడి కేసు - కిడ్నాప్ చేస్తామని బెదిరించిన వీర్ రాఘవరెడ్డి గ్యాంగ్
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి - ఆలస్యంగా వెలుగులోకి