40 Hanuman Temples In Jagtial District : బాలాంజనేయ, గండి హనుమాన్, వీరాంజనేయ, అభయాంజనేయ, సంకటాంజనేయ, స్వయంభు హనుమాన్ అంటూ వీధికో ఆంజనేయ స్వామి అక్కడ కొలువుదీరాడు. ఏ గ్రామంలోనైనా ఒక ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం సుమారు 40కి పైగా హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి.
ఏ విధి చూసినా ఆలయాలే : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊరు ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతూ వస్తోంది. ఈ గ్రామంలో ఇప్పటికే ప్రహల్లాద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు భక్తుల కొంగుబంగారమైన ఎల్లమ్మ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. ఇక ఆంజనేయస్వామి ఆలయాలు ఒకటి, రెండు కాదు ఏకంగా 40కి పైనే వెల్లులలో ఉన్నాయి. హనుమాన్ జయంతి వేళ ఏ వీధి చూసినా ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద కోలాహలంగా ఉంటుంది.
"పూర్వకాలంలో ఇక్కడ బ్రాహ్మణులు ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష స్వీకరించడంతో ఈ ప్రాంతంలో పంటలు, నీరు సమృద్ధిగా ఉంటాయి" -గ్రామస్థుడు
16వ శతాబ్దంలో జైనుల పరిపాలన : ఏ వీధికి వెళ్లినా హనుమంతుని దర్శనం జరుగుతుంది. వీధి వీధినా మారుతి ఆలయాలు ఉండడంతో ఒక్కో దేవాలయాన్ని ఒక్కో పేరుతో ఇక్కడి భక్తులు పిలుస్తుంటారు. 16వ శతాబ్దంలో జైనుల పరిపాలనలో ఇక్కడ సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో ఎవరైనా జబ్బు పడినప్పుడు మంచి జరగాలని ఉద్దేశంతో ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
41 రోజుల దీక్ష : హనుమాన్ జయంతి వేళ గ్రామంలో సందడిగా ఉంటుంది. ఎటు చూసినా కాషాయ వర్ణమే దర్శనమిస్తుంది. ఏటా చాలా మంది హనుమాన్ దీక్షలను స్వీకరించి 41 రోజులపాటు స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆంజనేయ స్వామిని పూజించడంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటున్నాయని హనుమాన్ మాలధారులు చెబుతున్నారు. 40కిపైగా ఆంజనేయస్వామి విగ్రహాలతో వెల్లుల్ల గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది.
భయం పోగొట్టి, రోడ్డు ప్రమాదాలు తగ్గించిన ఆసియాలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం!
24 గంటల పాటు అఖండ హనుమాన్ చాలీసా పఠనం - పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు