KCR Kaleshwaram Commission Inquiry Concludes: హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) విచారణకు హాజరయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌ని సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో 115వ సాక్షిగా కేసీఆర్‌ని కమిషన్ విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. కేసీఆర్ వెంట హరీశ్‌రావు ఉన్నారు.
ఆనకట్టల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది: విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌ను 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి కేసీఆర్ కమీషన్‌కి వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించగా కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ సమాధానం చెప్పారు. వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని అన్ని అనుమతులు తీసుకున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు.
ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం: కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని, ఇంక బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమని కేసీఆర్ చెప్పారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు కేసీఆర్ తెలిపారు. జీవో నంబర్ 45ను, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్‌ను కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు.
పొదిలిలో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు - మహిళలపై రాళ్ల దాడి
వెలుగులోకి కృష్ణంరాజు బహుముఖ వేషాలు - ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు