Former Minister Jogi Ramesh attend CID Inquiry : వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సీఐడీ విచారణకు హజరయ్యారు. విజయవాడ తాడిగడప సీఐడీ కార్యాలయంలో విచారణ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జోగి రమేష్ విచారణకు హాజరవ్వగా సుమారు గంటపాటు సీఐడీ అధికారులు విచారించారు. జోగి రమేష్‌తో పాటు మరో పది మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో జోగి రమేష్ సోదరుడు జోగి రాము కూడా ఉన్నారు. అయితే సీఐడీ విచారణకు జోగి రమేష్ సోదరుడు విచారణకు హాజరు కాలేదు. 11 మందిలో 8 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ విచారణకు హాజరయ్యానని జోగి రమేష్ తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చానని వెల్లడించారు. తాను ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ సీనియర్ నేత అప్పటి సీఎం జగన్‌ను దూషించినందుకే చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లానన్నారు. ఆ ఘటనలో తనపైనే టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. సీఐడీ నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎవరికీ భయపడనని జోగి రమేష్ అన్నారు.
తాను వైఎస్సార్ శిష్యుడినని, చిన్నప్పటినుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని జోగి రమేష్ తెలిపారు. 10 నెలల కాలంలోనే ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వచ్చిందన్నారు. అధికారం తాత్కాలికం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో భయపెడుతున్నారని వెల్లడించారు. 'మమ్మల్ని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వస్తాం' అని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి జోగి రమేష్‌కు సీఐడీ నోటీసులు
జోగి రమేష్‌కు ప్రశ్నలు - పొన్నవోలు సమాధానాలు: న్యాయవాది సిద్ధార్థ లూథ్రా