Food Checking News In Anakapalli District: అనకాపల్లిలో ఓ యువకుడు హోటల్‌లో బిర్యాని తింటుండగా బల్లి కనిపించింది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. వైద్యులు పరీక్ష చేసి ఇంటికి పంపారు. అనకాపల్లిలో డిగ్రీ విద్యార్థిని కడుపునొప్పితో ఆసుపత్రికి రావడంతో స్కానింగ్ చేశారు. రోజూ సాయంత్రం వేళ బజ్జీలు, పకోడీలు తినడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. బయట తిండి తినడం మానివేయాలని వైద్యులు ఈ సందర్భంగా సూచించారు.
జిల్లాలో ఆహారం వికటించి అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రుచుల కోసం తినే ఆహారంలో వాడే పదార్థాలు చాలా వరకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలకు తినే ఆహారమే ప్రధాన కారణంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లు తినడం యువతలో బాగా అలవాటుగా మారుతుంది. సాయంత్రం వేళలో రోడ్డు పక్కనున్న బడ్డీల్లో బజ్జీలు, నూడిల్స్, ఫ్రైడ్‌రైస్ లను ఎక్కువగా తింటున్నారు.
ఆహార పదార్ధాల్లో కొరవడిన నాణ్యత: చాలాచోట్ల నాసిరకం పదార్థాలతో పాటు పలుసార్లు మరిగించిన నూనెతో వంటకాలు చేస్తున్నారు. దీనికితోడు టేస్టింగ్ సాల్ట్, హానికర రంగులు వాడుతున్నారు. ఇవన్నీ కొనుగోలుదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత ఆహార పదార్ధాల నాణ్యతను పరీక్షించేందుకు ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లను నియమించారు. వీరి తనిఖీల్లో చిల్లర వ్యాపారుల్లో చాలామంది నాణ్యత కొరవడుతున్న ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఆహార తనిఖీలు: అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి అజీర్ణం, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో వస్తున్న రోగుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉంటోంది. సగటున నెలకు 1,800 మంది వరకు ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఒక్కటే నమూనా తరచూ వాడే నూనెలను ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు గతంలో టీపీఎస్ పరికరంతో పరీక్ష చేసేవారు. 25 శాతం కంటే తక్కువగా ఉంటే కేసులు నమోదు చేసేవారు. 2024 నుంచి ఈ పరికరం సాంద్రత పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దని ఆదేశాలు వచ్చాయి.
దీంతో నూనె శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపి అక్కడి నుంచి వచ్చే నివేదిక ప్రకారం కేసులు పెడుతున్నారు. ఆహార పరీక్షలకు హైదరాబాద్ కేంద్రానికి పంపడానికి కష్టమవుతుండడంతో అధికారులు తనిఖీలు చేపట్టడంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2024 నుంచి ఇప్పటివరకు ఒక నమూనాను మాత్రమే పరీక్షకు పంపారు.
మంచి ఆహారంతోనే ఆరోగ్యం: ఈ రోజుల్లో అందరికీ బయట ఆహారం తినడం అలవాటుగా మారుతోందని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అశోక్‌కుమార్ వివరించారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతోందని అన్నారు. హోటళ్లలో నిల్వ పదార్థాలతోపాటు తరచూ వాడే నూనెలో వేయించి ఇస్తున్నారని తెలిపారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ తిన్న తర్వాత అనేక ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్నవయస్సులోనే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టేస్టింగ్‌సాల్ట్ వల్ల రక్తపోటు పెరుగుతుంది, మంచి ఆహారం తీసుకుని వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని వివరించారు.
మా దృష్టికి తీసుకురండి: జిల్లాలో ఎక్కడైనా ఆహారం నాణ్యతగా లేదనిపించినా, వండే విధానంలో సమస్యలు గమనించినా తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కుమార్ తెలియజేశారు. హోటళ్ల యాజమాన్యం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తినే వస్తువులని నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. వారి ఆరోగ్యం బాగా ఉంటేనే వ్యాపారం బాగుంటుందని గుర్తించాలని పితవు పలికారు. జిల్లాలో ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని గుర్తు చేశారు.
ఇకపై ఆహార కల్తీల గుర్తింపు రాష్ట్రంలోనే - త్వరలో ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లు ఏర్పాటు
వైన్‌షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదేనంట! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!