Flood Flow Continues to Srisailam Reservoir : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, అలాగే సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా ఉంది.
ఉరకలెత్తుతోన్న కృష్ణమ్మ : వేసవి కాలంలో అరుదైన జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. సాధారణంగా జూన్, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ఒకే నీటి సంవత్సరంలో మధ్య నైరుతి రుతుపవనాలతో డ్యాం గేట్లు ఎత్తడం అరుదైన విషయంగా నిపుణులు చెబుతున్నారు.
రాబోయే 3 రోజుల్లో వర్షాలు : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆపై బలహీనపడి సాగర్ ఐలాండ్ ఖెపుపరా మధ్యలో తీరం దాటింది. దీంతో వాయుగుండ ప్రభావం రాష్ట్రంపై పడలేదు. నైరుతి రుతుపవనాలు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
డేంజర్లో 'శ్రీశైలం డ్యాం' - కాసులిస్తేనే ‘కట్ట’దిట్టం
ఆపదలో తెలుగురాష్ట్రాల జలభాండాగారం- శ్రీశైలం డ్యామ్ భవితవ్యం ఏం కానుంది?