Fishing Ban on Eastern Coast for 61 Days : తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61 రోజులపాటు జూన్ 15 వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కలిపి ఇంజిన్, కర్రతెప్పలు 2,360 ఉన్నాయి. సుమారు 80 వేల వరకు జనాభా ఉండగా, తెప్పలపై వేట చేసే వారు దాదాపు 14 వేల మందికిపైగా ఉన్నారు.
వాటికి ఎలాంటి ఆంక్షలు ఉండవు : ఈ ఆరు మండలాల్లోని అనేక గ్రామాల పరిధిలో నిషేధం అమలవుతుంది. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు రెండు నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మర, ఇంజిన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారలు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది.
మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు : వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన మత్స్యకారులకు ఈ ఏడాది మేలో మత్స్యకార భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మత్స్యకారులంతా ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంజిన్ తెప్పకు ఆరుగురు, పెద్ద మర పడవలకు 8 మంది ఉంటారు.
మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘిస్తే : చేపల వేట నిషేధానికి సంబంధించి గ్రామాల వారీగా ఉద్యోగులకు సూచనలు చేశామని విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. ఇంజిన్, మర పడవలు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. మత్స్యకార భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే చేస్తామని వెల్లడించారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళ్తే కేసులు నమోదు చేయడంతోపాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారని హెచ్చరించారు.
సముద్రంలో ప్రమాదాలను పసిగట్టొచ్చు - బోట్లకు ట్రాన్స్‌పాండర్లు
వామ్మో! కిలోమీటరు పొడవైన భారీ వల - ఒక్కసారి వేస్తే 50 టన్నుల చేపలు