Fish Farming In Mamidikuduru: మామూలుగా పక్షులను పంజరాలలో పెంచుతారనేది అందరికీ తెలుసు. కానీ, చేపలకు కూడా పంజరాలు ఉంటాయనేది మీకు తెలుసా? అవును చేపలను పంజరాలలో ఉంచి వాటిని పెంచడం, బాగోగులు చూసుకోవడం వంటివి చేస్తున్నారు. వాటి పెంపకంలో మంచి ఫలితాలు వస్తున్నాయట! తీర ప్రాంత ప్రజలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కూడా కల్పిస్తున్నారు అధికారులు.
సముద్ర పోటు జలాలు, ఉప్పునీరు పోటెత్తే నదీపాయల్లో నీటి పంజరాల ద్వారా ఎంపిక చేసిన చేపలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) వీటిని పర్యవేక్షిస్తోంది. లబ్ధిదారులకు సాంకేతికంగా శిక్షణ ఇచ్చి వారికి అండగా నిలుస్తోంది. తీర గ్రామాల్లో క్రమేణా వీటిని విస్తరించేందుకు కార్యాచరణ చేస్తోంది.
తక్కువ విస్తీర్ణం ఎక్కువ ఆదాయం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం పెదపట్నం, తొండంగి, అల్లవరం తదితర తీర మండలాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా లబ్ధిదారులకు ఉపాధి కల్పించడం కోసం నీటి పంజరాల్లో చేపల పెంపకాన్ని ప్రయోగాత్మక చేపట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల్లోని ఉప్పునీటి జలాల్లో 10×10 అడుగుల పరిమాణంలో పంజరాలను ఏర్పాటు చేసి ఒక్కో దానిలో 8 గ్రాముల బరువున్న దాదాపు 2 వేల ఇండియన్ పాంపానో (ముక్కుడు పార) చేపల పెంపకాన్ని చేపట్టింది. మే 30వ తేదీ నాటికి మార్కెట్‌లో విక్రయాలు చేసే విధంగా ఒక్కొక్కటి 300 గ్రాముల బరువు పెరిగాయి. విశాఖపట్నానికి చెందిన సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రాంతీయ కేంద్ర ప్రధానాధికారి డాక్టర్ కె. కిజాకుడాన్ సహా సముద్ర సాగు (మారికల్చర్) ప్రధాన శాస్త్రవేత్తల బృందం పరిశోధనాత్మకంగా పరిశీలించి మంచి ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది.
శిక్షణ అందించి: ఈ తరహా సాగుపై ఆసక్తి ఉన్నవారికి అవగాహన కల్పించి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టారు. అవసరమైన పంజరాలు, వలలు తదితర సామగ్రిని అందజేసేందుకు దృష్టి పెట్టారు. సమీపంలోని పాయల్లో ఉప్పునీటి పంజరాల్లో సాగువల్ల చేపలకు కావాల్సిన వాతావరణంతో పాటు పూర్తి భద్రత కూడా ఉంటుంది. వాటి ఉత్పత్తిని పెంచేందుకు ఇది సమర్థంగా ఉపయోగపడుతోంది.
మంచి ఫలితాలు వచ్చాయి: ప్రయోగాత్మకంగా తాము చేపట్టిన ఇండియన్ పాంపానో చేపల సాగు మంచి ఫలితాల్ని ఇచ్చిందని పెదపట్నానికి చెందిన రైతులు గుర్రం సురేష్, దినేష్, సాంకేతిక నిపుణుడు లక్ష్మీనారాయణ తెలిపారు.
దరఖాస్తు చేసుకోవచ్చు: ప్రయోగాత్మకంగా చేపట్టిన చోట్లలో మంచి ఫలితాలు కనిపించాయి. ఈ విధానం ద్వారా చేపలు సాగు చేసేవారికి అవసరమైన సాంకేతికపరమైన అన్ని అంశాలపై అవగాహన కల్పించాం. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు.