First Free Sewing Training Center Formally Inaugurated in Gorantla : కుటుంబాల్లో ఒకరి సంపాదన సరిపోని విధంగా రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలే కాదు పిల్లలను చదివించాలంటే రూ.వేలు. రూ.లక్షల్లో ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాల్లోని మహిళలు సైతం ఉపాధి అవకాశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వావలంబన దిశగా అలోచించింది.
ఆర్థికంగా ఏదగడానికి తోడ్పాటు అందివ్వాలని సంకల్పించింది. ఆ దిశగా ముందడుగు వేసింది. ఉచితంగా కుట్టు శిక్షణతో పాటు మిషన్ కూడా ఇచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చొరవతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటి ఉచిత కుట్టు శిక్షణ సెంటర్‌ను గోరంట్లలో లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందికి శిక్షణ ఇవ్వడానికి 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోరంట్లలో నాలుగు, వానవోలు గ్రామంలో ఒకటి ప్రారంభించారు.
ఒక్కో కేంద్రంలో 120 మంది : ప్రతి సెంటర్లో రోజూ 120 మందికి ట్రైనింగ్ అందించే విధంగా అయిదే కేంద్రాల్లో 600 మందిని ఎంపిక చేశారు. మొదటి విడతలోనే 746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కేంద్రాలకు మిషన్లు చేరాయి. కేంద్రానికి ఇద్దరు చొప్పున ట్రైనర్లు ఎంపికచేసి 90 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా ఒక్కో కేంద్రానికి 120 మందిని ఎంపికచేశారు.
హాజరు తప్పనిసరి : లక్ష్యం పక్కదారి పట్టకుండా ఫేషియల్‌యాప్ హాజరు పద్ధతిని అధికారులు ప్రవేశపెట్టారు. దీంతో ప్రతి ఒక్కరూ కేంద్రానికి వచ్చి, వెళ్లే సమయంలో ముఖ హాజరు వేయాల్సి ఉంది. 75 శాతానికి తగ్గకుండా హాజరు ఉంటేనే మిషన్ ఇవ్వడం జరుగుతుందని నిబంధన పెట్టారు. మహిళలు తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి. కుట్టుమిషన్‌తో వచ్చే ఆదాయంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ ఆశయం.
ప్రభుత్వం ఉన్నతాశయంతో పెట్టిన ఈ కేంద్రం తమలాంటి పేదలకు వరం లాంటిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీగా జీవనం చేస్తున్నామన్నారు. ఏటికేడు వ్యవసాయం తగ్గిపోతోందని, చేయడానికి పనుల్లేకుండా పోతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.