Fire Engine Services for Rent Events : పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్నారా? అయితే అగ్నిమాపక శకటం (ఫైరింజన్) బుక్ చేశారా? అవును మీరు చదివింది నిజమే. జనాలు ఎక్కువగా ఉన్నచోట ప్రమాదాల నుంచి రక్షణ కోసం అగ్నిమాపకశాఖ అద్దె ప్రాతిపదికన ఫైరింజన్లు పంపుతోంది. దీనిద్వారా అధిక సంఖ్యలో జనం హాజరయ్యే వేడుకల్లో అనుకోని ప్రమాదం జరిగితే తక్షణ సాయం పొందే వీటుంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఫంక్షన్లు అవుతున్నప్పుడు కొందరు టపాసులు కాల్చడం, విపరీతమైన విద్యుత్ డిమాండ్‌తో ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తి షార్ట్‌సర్క్యూట్ అవ్వడం, డెకరేషన్ వంటివాటికి వాడే వస్తువులు మండే స్వభావం కలిగి ఉండటం, ఈ నేపథ్యంలో నిప్పు ముప్పు పొంచి ఉంటుందని, ఎలాంటి ఏమరుపాటు వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఫైరింజన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్లో బుకింక్ : వివాహాలకే కాకుండా క్రికెట్ టోర్నమెంట్లు, మైదానాల్లో నిర్వహిచే సభలు, సమావేశాలు వంటివాటికి కూడా అద్దెకు అగ్నిమాపక సేవలు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమాలను బట్టి అద్దెను చెల్లించి ఈ సేవలు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే చాలు, మనం ప్లేస్, టైమ్ ఇతర వివరాలు ఇస్తే అగ్నిమాపకశాఖ వాహనాలను పంపుతుంది. ఇప్పటికే నుమాయిష్‌తో పాటు ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకలు, సభలకు వాహనాలను అద్దెకిస్తోంది.
ట్రావెలింగ్ ఛార్జీలు కూడా : వాహనం పంపే స్టేషన్ నుంచి కార్యక్రమం జరిగే ప్రాంతానికి దూరాన్నిబట్టి కిలోమీటరుకు రూ.20 చొప్పున ప్రత్యేకంగా చెల్లించాలి. పెళ్లి వేడుకలకైతే గంటకు రూ.3,000, రోజుకు రూ.30,000 చొప్పున అద్దె ఉంటుంది. అదే వాణిజ్య, స్వచ్ఛంద సేవాసంస్థల కార్యక్రమాలకు గంటకు రూ.1,500 - 2,000, రోజుకు రూ.15,000 - రూ.20,000 వరకు ఛార్జీలు చెల్లించాలి.
సేవలను బట్టి అద్దెలు : వర్షాలు, వరదల సమయంలో పంపింగ్ (నీటిని తోడే) సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి గంటకు రూ.750 నుంచి రూ.1,500 అద్దె ఉంటుంది. ఇలాంటి సేవల కోసం అగ్నిమాపకశాఖ అధునాతన పంపులను కొనుగోలు చేసింది. సినిమా షూటింగ్‌లకు గంటకు రూ.2 వేలు, రోజుకు రూ.20 వేల వరకు వసూలు చేస్తారు. స్టాండ్‌బై వెహికల్ సేవలకు గంటకు రూ.3 వేలు, రోజుకు రూ.30 వేలు అద్దె ఉంటుంది.
నీటిపైపులు పగిలిపోయినప్పుడు, ఇతర సందర్భాల్లోను, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరినప్పుడు కూడా అగ్నిమాపకశాఖ సేవలను వినియోగించుకోవచ్చు. ఇలాంటి పంపింగ్ సేవలకు గంటకు రూ.2 వేలు, రోజుకైతే రూ.20,000 ఛార్జీ చేస్తారు. వివరాలకు https: //fire.telangana.gov.in/WebSite/standby.aspx వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
రక్షణ కోసం ఈ సేవలు : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంపింగ్, స్టాండ్ బై వెహికల్ పద్ధతిలో అగ్నిమాపకశాఖ అద్దె సేవలు అందిస్తోందని హైదరాబాద్ అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు. ఎక్కువ జనసందోహం ఉన్న ప్రాంతాల్లో రక్షణ కోసం ఈ సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈ సేవలు పొందవచ్చని వివరించరు.
వేసవి కాలం వచ్చేసింది - ఇంట్లో మంటలతో జాగ్రత్త
అగ్ని ప్రమాదం సంభవించిందా? - అయితే కంగారు పడకండి - ఇలా చేస్తే సరి! - Fire Mock Drill In Hyderabad
వేసవిలో భయపెడుతోన్న అగ్ని ప్రమాదాలు - ఈ విపత్తులను అధిగమించేదెలా? - Fire Accidents In Summer