Fire Accident In Timbur Depot Annamayya District: అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టింబర్ డిపోలో మంటలు చేలరేగి అందులోని కోట్ల విలువైన కలప మంటల్లో పూర్తిగా కాలిపోయి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపుచేశారు.
పట్టణంలోని ఎస్సార్ కళ్యాణమండపం సమీపంలో ఉన్న టింబర్ డిపో అగ్నికి ఆహుతి అయ్యింది. అర్ధరాత్రి టింబర్ డిపోలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో డిపోలోని విలువైన కలప కాలి బూడిదైయ్యింది. సంఘటన స్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకున్నా అర్ధరాత్రి కావడంతో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనలో డిపోలోని కలప కాలిపోయిందని కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని టింబర్ డిపో యజమాని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యర్ధుల పనేనన్న యజమాని: వ్యాపారంలో ఉన్న ప్రత్యర్థులే నిప్పు పెట్టి ఉంటారని టింబర్ డిపో యజమాని హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. తాము రోజూ మిషన్ మూసి వేసే సమయంలో విద్యుత్ నిలిపివేసి ఫీజులు తీసేస్తామని, అలాంటిది షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు లేవని ఆయన తెలిపారు. వ్యాపారంలో తన ఉన్నతిని ఓర్చుకోలేకే ఎవరో ఇలాంటి పనికి పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
"అర్ధరాత్రి మంటలు చేలరేగాయి. వాచ్మెన్ ఫోన్ చేశాడు. వెంటనే స్పందించి రెండుఫైర్ ఇంజన్లు, జేసీబీ సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాం. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం 7 గంటల వరకు కలప మంటల్లో కాలిపోతూనే ఉన్నాయి. బల్లార్షా టేకు, పర్మిట్ టేకు డిపోలో ఉన్నాయి. సుమారు 2 కోట్ల రూపాయల విలువ గల కలప కాలిపోయింది. మిషనరీ కాలిపోయి ధ్వంసమైపోయింది. ఎవరో మేమంటే పడని వాళ్లు చేసిన పనిలా ఉంది." -హరికృష్ణ, టింబర్ డిపో యజమాని