Telangana Engineering Fees : ఇక నుంచి బీటెక్ చదువులంటే తల్లిదండ్రులు భయపడేంతలా కొత్త ఫీజులు రానున్నాయి! ఇంజినీరింగ్ కళాశాలలు అడుగుతున్న ఫీజులు వింటేనే వారి గుండెలు అదిరిపోవాల్సిందే. ఎందుకంటే ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కళాశాల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనల్లో పలు కాలేజీలు ఏకంగా 50 నుంచి 80 శాతం ఫీజులను పెంచాలని కోరుతున్నాయి.
ఇందులో సీబీఐటీ ఏకంగా రూ.2.94 లక్షల ఫీజును ప్రతిపాదించగా, ఐదు కళాశాలలు రూ.2 లక్షలు మించి, 60కి పైగానే కళాశాలలు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫీజు కోరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 33 కళాశాలల్లో రూ.లక్ష, ఆపై ఫీజు ఉండగా, ఈసారి మాత్రం ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తొలిసారిగా పలు కళాశాలల్లో ఫీజు రూ.2 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు! : ప్రతి మూడేళ్లకోసారి రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వసూలు చేస్తున్న ఫీజులను 2022లో నిర్ణయించారు. ఈ ఫీజులే 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయి. ఆయా సంవత్సరాల్లో బీటెక్ తొలి ఏడాదిలో చేరిన వారికి కోర్సు పూర్తయ్యే నాలుగేళ్లూ పాత రుసుములే ఉండనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాత ఫీజుల గడువు ముగుస్తుండగా, వచ్చే విద్యా సంవత్సరం(2025 - 26) నుంచి నూతన ఫీజులు అమల్లోకి రానున్నాయి.
ఈ కొత్త ఫీజులు 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో చేరేవారికి వర్తిస్తాయి. కొత్త రుసుముల కోసం 157 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు టీఏఎఫ్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకున్నాయి. 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదికలను సమర్పించాయి. వాటిని కూడా ఆడిటర్లు పరిశీలిస్తున్నారు. కళాశాలల్లోని సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను పరిగణనలోకి తీసుకునే కొత్త ఫీజులను కమిటీ ఖరారు చేయనుంది.
2022లో మాత్రం కొన్నింటికి పెంపు, ఇంకొన్నింటికి తగ్గింపు : 2022లో టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులను ఖరారు చేసే సమయంలో పలు కళాశాలలకు భారీగానే పెంచింది. మరికొన్ని కళాశాలలకు మాత్రం తగ్గించింది. ఎంజీఐటీకి రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెంచగా, అదే నారాయణమ్మ కళాశాల ఫీజు రూ.1.22 లక్షలు నుంచి రూ.1 లక్షకు తగ్గించారు. సీబీఐటీ ఫీజును రూ.1.34 లక్షల నుంచి తొలుత రూ.1.73 లక్షలకు పెంచగా, తర్వాత రూ.1.15 లక్షలకు తగ్గించేశారు. అనంతరం రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై ఆ కళాశాల హైకోర్టును సైతం ఆశ్రయించింది. దీంతో టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజును రూ.1.65 లక్షలుగా ఖరారు చేసింది. కొన్ని కళాశాలలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండానే పాత ఫీజులనే కొనసాగించారు.
మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష - సిలబస్‌పై కీలక ప్రకటన