Fees in Polytechnic Colleges are Hiked : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజు భారీగా పెరిగింది. గత దశాబ్దకాలంగా అధికారికంగా రూ.14,900గా ఉండగా ఇప్పుడు 2023-24, 2024-25లతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి గరిష్ఠ ఫీజు రూ.39 వేలకు చేరింది. తెలంగాణలోని 55 ప్రైవేట్ కళాశాలలకు ఫీజు నిర్ణయించగా అందులో 43 కాలేజీలకు రూ.39 వేలు ఫీజు ఉండటం గమనార్హం. మరికొన్ని కాలేజీలకు రూ.25 వేల నుంచి రూ.35 వేలుగా నిర్ణయించారు. కేవలం రెండు కళాశాలలకే రూ.14,900, రూ.15 వేలుగా ఫీజు నిర్ణయించారు. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీజీఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజులను నిర్ధారించి, ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం జీఓ 38ని జారీ చేసింది.
తాజా పరిస్థితులకు అనుగుణంగా : దశాబ్దకాలంగా ఫీజులు పెంచలేదని, తాజా పరిస్థితులకు అనుగుణంగా రుసుమును నిర్ణయించాలని 2023-24 విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో వాటికి టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులు నిర్ణయించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా కాలేజీలు రూ.40 వేల ఫీజు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, రుసుములు ఖరారు చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఫీజుల కమిటీ సైతం మిన్నకుండిపోయింది.
ఎలాంటి కదలిక లేదు : ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25) ప్రవేశాలు మొదలయ్యే వరకు ఎలాంటి కదలిక లేదు. దాంతో మళ్లీ పలు కళాశాలలు హైకోర్టుకు వెళ్లి, న్యాయస్థానం తీర్పుతో ఈ ఏడాదీ రూ.40 వేలు వసూలు చేశాయి. కాకపోతే కౌన్సెలింగ్ వెబ్‌సైట్లో మాత్రం అన్ని ప్రైవేట్ కాలేజీలు రూ.14,900 మాత్రమే ఫీజు ఉన్నట్లు చూపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా కళాశాల విద్యార్థుల నుంచి వేరుగా వసూలు చేశాయి.
ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులను నిర్ధారించి ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో అందుకనుగుణంగా విద్యాశాఖ ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ ఫీజులు 2023-24, 2024-2025లతోపాటు వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) కూడా వర్తిస్తాయని పేర్కొంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 మాత్రమే చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతేడాది డిప్లొమా కోర్సుల్లో సుమారు 30 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు.
భారీగా పెరగనున్న ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు - అత్యధికంగా రూ.2.23 లక్షలు
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు - నియంత్రణకు త్వరలోనే ప్రత్యేక చట్టం!
హడలెత్తిస్తున్న బీటెక్ ఫీజులు - ఈసారి ఏకంగా రూ.2 లక్షల పైనే!