Mylavaram Father Killed Children : ఆరోగ్యం సహకరించక, పిల్లల బాధ్యత తీసుకోలేమని చెప్పడంతో ఆ కుమారుడు, తల్లిందండ్రులతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఆ దంపతులు దూరంగా వేరే ఇంటికి వెళ్లిపోయారు. ఇల్లు మారినా పిల్లలపై మమకారంతో మూడ్రోజులుగా చూసేందుకు ఇంటికొస్తున్న తాతను గదికి వేసిన తాళం వెనక్కి పంపింది. ముక్కుపచ్చలారని మనవడు, మనవరాలిని తమ కుమారుడు బాగానే చూసుకుంటాడని భావించిన ఆ తాత తాళం వేసిన గదిలోనే వారి మృతదేహాలున్నాయని తెలుసుకోలేకపోయారు.
చివరికి మనవడి సైకిల్ ఎండలో ఉందని నీడన పెడదామని ఆ తాత వెళ్లాడు. కానీ ఇంటి నుంచి దుర్గంధం రావడంతో కిటికీ నుంచి లోపలికి చూసిన ఆయనకు కళ్లు చెమర్చాయి. మంచంపై నిద్రిస్తున్నట్లే ఉన్న మనవడు, మనవరాలు విగతజీవులయ్యారని తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. ‘పిల్లల్ని గదిలో పెట్టి ఎక్కడికి వెళ్లావురా' అని గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరోవైపు కుమారుడు బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చనే విషయం తెలుసుకుని ఆ పెద్దాయన కుప్పకూలిపోయారు. ఇది ఓ తండ్రి తన పిల్లలకు రాసిన మరణ శాసనం. ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లక్ష్మీపతి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు రవిశంకర్‌కు చంద్రికతో వివాహమైంది. వీరికి కుమార్తె లక్ష్మి హిరణ్య (9), కుమారుడు లీలాసాయి (7) ఉన్నారు. లక్ష్మీపతి స్థానిక రహదారులు భవనాల శాఖ కార్యాలయ సమీపంలో కటింగ్ షాప్ నిర్వహించేవారు. వీరంతా ఏడాదిగా వాటర్ ట్యాంకు పక్కన ఉన్న రేకుల షెడ్డులోని చెరొక గదిలో వేర్వేరుగా ఉంటున్నారు.
Andhra Man Kills 2 Children : విభేదాల నేపథ్యంలో తండ్రికుమారుల మధ్య కొన్నాళ్లుగా మాటల్లేవు. రవిశంకర్ కొన్నాళ్లపాటు స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లో పని చేశాడు. ఈ క్రమంలో రెండు నెలల కిందట కోడలు చంద్రిక పుట్టింటికని భీమవరం వెళ్లిపోయింది. పిల్లలిద్దరినీ రవిశంకర్ జి.కొండూరులోని ఒక వసతిగృహంలో చదివిస్తున్నాడు. నెల కిందట సెలవుల నిమిత్తం వారిని ఇంటికి తీసుకొచ్చాడు. మధ్యలో నానమ్మ అనిత వారికి వండి పెట్టినా అమ్మ వద్దన్నదని ఆ చిన్నారులు తిరస్కరించారు.
దీంతో గత నెలాఖరులో లక్ష్మీపతి, అనిత వేరే ఇళ్లు అద్దెకు తీసుకొని మారిపోయారు. పిల్లలతో కలిసి రవిశంకర్ ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. మూడ్రోజుల కిందట లక్ష్మీపతి అక్కడకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తర్వాత రోజు పిల్లల మేనమామ వారి పిల్లల్ని తీసుకొని వచ్చినా అదే పరిస్థితి. గురువారం నాడు ఉదయం అటుగా వచ్చిన తాత మనవడి సైకిల్‌ను నీడలో పెడదామని తలుపు వద్దకు వెళ్లగా దుర్వాసన వస్తోంది. కిటికీ నుంచి చూసి, ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపు పగలగొట్టి లోపల చూడగా చిన్నారులిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ డి. చంద్రశేఖర్, ఎస్సై కె. సుధాకర్‌లు ఘటనా స్థలానికి పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని ఫోన్ చేయగా రవిశంకర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంది. చంద్రిక తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొంది. చిన్నారులకు సమీపంలో పురుగుల మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం క్లూస్ టీంను రప్పించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Mylavaram Tragedy Incident : ఇంటి ముందు ఉన్న దుకాణదారుడిని పోలీసులు అడగ్గా నాలుగు రోజుల కిందట పిల్లలకు రవిశంకర్ చిరుతిండ్లు కొనిచ్చాడని తెలిపాడు. ఏమైనా కావాలంటే ఇవ్వాలని అతను తమకు చెప్పాడని పేర్కొన్నాడు. అప్పటి నుంచి కన్పించలేదని వివరించాడు. తమ కోడలు కువైట్ వెళ్లినట్లు ఇటీవలే తెలిసిందని పిల్లల నానమ్మ అనిత పోలీసులకు తెలియజేసింది. కుమారుడికి కొంత అప్పులు కూడా ఉన్నాయని, ఏ అఘాయిత్యం చేశాడో అర్థం కావడం లేదని ఆమె వాపోయింది.
ఈ ఘటన ఐదు రోజుల కిందటే జరిగిందని లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు. తన పుట్టినరోజు జూన్ 8 అనీ, తనకు, పిల్లలకు చావు రోజు కూడా ఇదేనని ఆ లేఖలో రవిశంకర్ తెలిపాడు. పిల్లలకు అదే రోజు విషమిచ్చి వారు చనిపోయే వరకు అక్కడే ఉండి తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మొదట రవిశంకర్ పరారై ఉంటాడని పోలీసులు భావించారు. కానీ అతని కాల్ డేటా పరిశీలిస్తే 8న సాయంత్రం 5.20 గంటలకు మైలవరం నుంచి ఇబ్రహీంపట్నం వచ్చినట్లు ఉంది. రవిశంకర్ చేసిన చివరి కాల్ అతని షాపు యజమానికి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని పిలిచి పోలీసులు విచారించారు.
తనకు ఫోన్ చేసింది వాస్తవమేనని యజమాని పోలీసులకు తెలిపారు. రవిశంకర్ అప్పులు ఎక్కువగా ఉన్నాయనీ, మందు తాగాననీ, చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాడు. ఇలా తరచూ అతను చనిపోతానని చెబుతుండేవాడని వివరించాడు. దీంతో రవిశంకర్ బెదిరింపు కోసమే చేశాడని తాను నమ్మినట్లు చెప్పాడు. కానీ అనుమానం వచ్చి రవి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉందని యజమాని పోలీసులకు తెలియజేశాడు.
నా పుట్టినరోజు నాడే - అందరికీ చివరి రోజు : 'మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. నా భార్యకు నేను, పిల్లలు తప్ప వేరు ఎవరూ లేరు. అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ మరణించారు. ఇప్పుడు మేం కూడా. చందూ (చంద్రిక) నన్ను క్షమించు. నీకు ఇచ్చిన మాట తప్పాను. మేం అందరూ ఉన్న అనాథలం. మమ్మల్ని అనాథలుగానే వదిలేయండి ప్లీజ్. నా పిల్లలుగా పుట్టిన పాపానికి వాళ్లని బలిచ్చాను.
నా భార్యకు అన్యాయం చేశాను. 15 రోజుల ముందు చంద్రికకు ఫోన్ చేసి మేం చనిపోతున్నాం అని ఎలుకల మందు కలిపినప్పుడు తాను చస్తానని బిల్డింగ్ ఎక్కి మమ్మల్ని ఆపింది. కానీ నన్ను క్షమించు చందూ నా కోసం మీ వాళ్లందరినీ వదిలేశావు. కానీ నీ కోసం ఏమీ చేయలేక పిరికివాడిలా పిల్లలను తీసుకొని వెళ్తున్నా. నా జీవితంలో ఏదీ అనుకున్నది కాలేదు. అందరూ నా దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించారే కానీ నాపక్కన నిలబడి ఎవరూ ధైర్యం చెప్పలేదు. అందుకే నేను, పిల్లలు వెళ్లిపోతున్నాం. మమ్మల్ని అనాథ శవాలుగానే ఖననం చేయండి. ఇదే నా చివరి కోరిక. 8.6.92 నా పుట్టినరోజు. 8.6.2025 నాకు, నా పిల్లలకు చావురోజు' అని రవిశంకర్ లేఖలో రాశాడు.
రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు : మరోవైపు రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలోకి దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని చివరి లొకేషన్ ఆ రోజు 9 గంటలకు చూపించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఈ క్రమంలో అతడు నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. నాలుగు రోజులైనా ఇంకా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు ఎస్డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.