FATHER AND SON DROWN IN PENNA RIVER: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులోని పెన్నా నదిలో ఈతకు వెళ్లిన తండ్రీకుమారుడు గల్లంతయ్యారు. జమ్మలమడుగు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో మొదట కుమారుడు జోయల్(16), తర్వాత తండ్రి మనోహర్ (40) మృతదేహాలను వెలికి తీశారు.
మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడున్న వారి మనసు కలచివేసింది. జమ్మలమడుగు బీసీ కాలనీలో ఉన్న సోదరిని చూడటానికి మనోహర్ కుటుంబంతో సహా శుక్రవారం రాత్రి చేరుకున్నారు. శనివారం కుటుంబ సభ్యులంతా గండికోటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. గండికోటలో జలపాతాలు లేవు అని, కాసేపు నదిలో ఈత కొడతామని పెన్నా వంతెన కిందకు చేరుకున్నారు. తండ్రి మనోహర్ గుంతలోకి జారిపోతుండగా, కుమారుడు జోయల్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ లోతైన గుంతలో కూరుకుపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. మనోహర్ కుటుంబం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
విహారంలో విషాదం: అల్లూరి జిల్లాలో ఓ పర్యాటక బృందానికి విహారంలో విషాదం నెలకొంది. మోతుగూడెం సమీపంలో సీలేరు నదిలో ఒకరు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దేవరపల్లికి చెందిన 20 మంది భవన కార్మికుల బృందం అల్లూరి జిల్లా మోతుగూడెం సమీపంలో ధారాలమ్మ పిక్నిక్ స్పాట్‌కు వచ్చారు.
సీలేరు గదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు కొట్టుకుపోతుండగా నలుగురిని స్థానికులు, పోలీసులు కాపాడారు. 18 ఏళ్ల అభిలాష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పర్యటన ప్రాంతాల్లో వర్షాలు ఉద్ధృతికి గడ్డలు, వాగులు పొంగుతాయని, పర్యాటకులు గమనించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డ్యామ్‌లో పడి ఇద్దరు మృతి: అదే విధంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు డ్యామ్‌లో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులను శ్రీకాళహస్తికి చెందిన నిఖిల్ (8), లిఖిత (13)గా గుర్తించారు.