Farmers Lost Crops Due to Rains in NTR District: పగలు ఎండ తీవ్రత ఉండగా రాత్రయితే గాలులతో కూడిన వానలు రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి అందివచ్చిన సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంకులతో ఉన్న మామిడి, మొక్కజొన్న, జొన్న, బొప్పాయి, ఆకుకూరలు తదితర పంటలు దెబ్బతిన్నాయి. అసలే తెగుళ్ల కారణంగా మామిడి దిగుబడి అంతంతమాత్రంగా ఉండగా వీస్తున్న ఈదురుగాలులకు కాయలు రాలిపోయాయి.
వరుసగా పడుతున్న అకాల వర్షాలతో ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంట తడిచిపోవడం వల్ల ఎన్టీఆర్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, జీ కొండూరు మైలవరం, రెడ్డిగూడెం మండలాలలో పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా రెడ్డిగూడెం మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారు. మైలవరం నియోజకవర్గంలో మామిడి సాగు దాదాపు 1000 హెక్టార్లు ఉంది. అయితే ఈ ఏడాది పూత అలస్యంగా రావడంతో పాటు పురుగులు, తెగుళ్ల కారణంగా పూత, పిందె దశలోనే రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
అకాల వర్షాలతో తీవ్ర నష్టం - ప్రభుత్వం ఆదుకోవాలంటున్న అన్నదాతలు
ప్రభుత్వమే తమను ఆదుకోవాలి: కాసిన కొద్దిశాతం కూడా వీచిన పెనుగాలుకు సగానిపైగా మామిడి కాయలు రాలిపోయాయి అక్కడక్కడా మామిడి చెట్లు సైతం నేలకొరిగాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని మైలవరం, రెడ్డిగూడెం, జి. కొండూరు, మండలాల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మండలాల్లో 500 హెక్టార్లలో 50 శాతానికి పైగా మామిడి కాయలు నేలరాలి రైతులు నష్టపోయినట్లు ఉద్యాన అధికారులు అంచనాలు తయారు చేశారు. నియోజకవర్గంలో దాదాపు 1200 హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుండగా 50 శాతానికి పైగా మొక్కజొన్న ఇప్పటికే కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోశారు.
మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతుండటంతో గిట్టుబాటు కాక రైతులు అమ్మకుండా కల్లాల్లోనే ఉంచారు. ఇటీవల కురిసిన వర్షానికి , మైలవరం నియోజకవర్గాల్లోని ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. అంతే కాకుండా వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరు నేలవాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అధికారులు, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఈ నీరు తాగగలరా? అధికారుల దూరదృష్టి లేమితో కృష్ణా కెనాల్ లక్ష్యం ఢమాల్
వడగండ్ల వాన - దెబ్బతిన్న పంటలు - ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం