Deer Issue in Narayanpet District : వర్షాకాలం సీజన్ వచ్చిందంటే రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. కానీ ఆ ప్రాంత రైతులు మాత్రం జంకుతారు. ఒకవేళ వేసినా కాపాడుకునేందుకు, కంటి మీద కునుకు లేకుండా కాపలా కాయాల్సి వస్తుంది. మొలకెత్తిన మొక్క బతకడం కష్టంగా మారింది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ పరిష్కారం మాత్రం దొరకలేదు.
రైతుల పాలిట శాపంగా : నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు, మాగనూరు, మక్తల్, ధన్వాడ, మరికల్, నర్వ మండలాల్లో ఏటా జింకల సంతతి గణనీయంగా పెరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణుల సంతతి పెరగడం మంచి పరిణామమే. కానీ ఈ జింకలు సమీప ప్రాంతాల్లోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. జింకల బెడదతో వేసిన పంట చేతివరకు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. పంటలు, చేన్లపై జింకలు స్వైర విహారం చేస్తున్నాయి. మొలకెత్తిన పత్తి మొక్కల్ని తినేస్తున్నాయి. అసలే వర్షాలు సరిగా లేక, విత్తనాలు మొలకెత్తని పరిస్థితుల్లో జింకల బెడద రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది.
రాత్రి వేళల్లోనే చేలపై : ఉదయం, రాత్రి వేళల్లోనే జింకలు ఎక్కువగా చేలపై దాడి చేస్తున్నాయి. దీంతో పంటను రక్షించుకునేందుకు రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. అయినప్పటికీ గుంపులుగా వస్తున్న జింకల మందను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ఒకటికి, రెండుసార్లు విత్తనాలు నాటాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరలించడం ఒక్కటే మార్గం : జింకల బెడద తప్పాలంటే వాటిని అక్కడి నుంచి తరలించడం ఒక్కటే మార్గం. ఇందుకోసమే కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో సర్వే నెంబర్లు 192, 194లలో 74.12 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారులు భూసేకరణ చేసి, నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించగా, రూ.2.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ సంరక్షణ కేంద్రం ఏర్పాటు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత తొందరగా జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
కోతుల బెడద అరికట్టే వారికే మా ఓటు - ఫ్లెక్సీలతో వినూత్న నిరసన