Sugarcane Cultivation Using AI : AI లేని రంగమేదీ? అంటే సమాధానం కష్టమే. అన్నింటా నాదే హవా అంటూ క్రమంగా విస్తరిస్తోంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. భూగర్భం మొదలు ఆకాశం వరకు జరిగే అన్ని రకాల ప్రయోగాల్లో తనదైన మార్క్ చూపిస్తూనే ఉంది. వ్యవసాయరంగంలోనూ అద్భుత ఫలితాలు అందిస్తోంది. దాన్ని మరింతగా అందిపుచ్చుకున్న మహారాష్ట్ర రైతులు పంట దిగుబడి సహా ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు. కృత్రిమ మేధ సాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి 30శాతానికి పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు.
చెరకు సాగుకు ఏఐని ఉపయోగిస్తూ సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి అభివృద్ధి చేసిన సరికొత్త పరిజ్ఞానంతో ఏకంగా వెయ్యి మంది చెరకు రైతులు లబ్ధి పొందుతున్నారు. మరి ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సంప్రదాయ సాగు పద్ధతికి, ఏఐ ఆధారిత వ్యవసాయానికి తేడా ఏంటి? రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుంది? మన దగ్గర కూడా ఏఐ సాగు మొదలు పెట్టాలంటే ఏం చేయాలి?
కృత్రిమ మేధ సాయంతో సిరుల పంట పండించే విప్లవాత్మక ప్రయోగం సఫలమైంది. దేశంలేనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది. మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఈ అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ సాగును వీడి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్న రైతులకు 30 శాతం నుంచి 40 శాతం అధిక ఆదాయం లభించనుంది.
విస్తీర్ణం పరంగా అత్యధికంగా చెరుకు సాగు కానీ : విస్తీర్ణం పరంగా భారతదేశం అత్యధికంగా చెరకును సాగు చేస్తుంది. కానీ ఉత్పత్తి మాత్రం బ్రెజిల్, చిలీ కంటే చాలా తక్కువ. నేటికి సంప్రదాయ సాగు విధానాలు అనుసరించడమే ఇందుకు కారణం. భూసారం తగ్గడం, సాయిల్ ప్రొఫైల్‌కు అనుగుణంగా సాగు పద్ధతులు మార్చకపోవడం, డ్రిప్ ఉపయోగించకపోవడం, నాణ్యత లేని మొక్కలు, ఎరువుల వాడకంపై అవగాహన లోపం, తగినంత ఖాళీ వదలకుండా అడ్డదిడ్డంగా మొక్కలు నాటడం, వాతావరణ పరిస్థితుల్ని విస్మరించడం, కూలీల కొరత వంటివి చెరకు సాగులో లాభాలను పరిమితం చేస్తున్నాయి.
ప్రాజెక్టు ఫామ్ వైబ్స్ : సంప్రదాయ సాగులోని ఈ సమస్యలు రైతులకు నష్టాలు మిగల్చడమే కాక, పర్యావరణానికీ హాని కలిగిస్తున్నా యి. కర్బన ఉద్గారాల్లో 25శాతం వ్యవసాయ సంబంధిత పనులతో ఉత్పన్నం అవుతున్నవే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో 70 శాతం ఖర్చవుతున్నదీ సాగు అవసరాలకే. ఈ రెండూ వాతావరణ మార్పు సమస్యను మరింత పెంచుతున్నాయి. ఫలితంగా అకాల వర్షాలు, కరవు వంటి విపత్తులతో రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని సంకల్పించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవసాయంలో సుస్థిరత సాధనే లక్ష్యంగా 'ప్రాజెక్ట్ ఫామ్ వైబ్స్' చేపట్టింది.
వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారాన్ని సాంకేతికత సాయంతో రైతులకు అందించడమే 'ప్రాజెక్ట్ ఫామ్ వైబ్స్' ఉద్దేశం. ఏఐ టెక్నాలజీ అందించే వివరాలకు అనుగుణంగా సాగులో మార్పులు చేస్తే లాభాలు ఖాయమన్నది ఆ సంస్థ ఆలోచన. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్‌ను భారత్‌కు తీసుకురావడంలో మహారాష్ట్రలోని బారామతి వ్యవసాయాభివృద్ధి ట్రస్ట్ నిర్వాహకులు ప్రతాప్‌రావ్ పవార్ కీలకంగా వ్యవహరించారు.
14.20 లక్షల హెక్టార్లలో చెరకు : 2024-25 సర్వే ప్రకారం మహారాష్ట్రలో 14.20 లక్షల హెక్టార్లలో చెరకు పండిస్తున్నారు. 11వందల లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ విలువను మరింత పెంచే లక్ష్యంతో ప్రతాప్‌రావ్ పవార్ 2024 జులైలో తొలి అడుగు వేశారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తోడ్పాటుతో 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫామ్ వైబ్స్' ఏర్పాటు చేశారు. ట్రస్ట్ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా, బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఏఐ వ్యవసాయంలో భాగమయ్యారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ వీరికి మార్గదర్శి అయింది.
అన్నింటినీ చెప్పే మొబైల్ యాప్ : వాతావరణ అంచనాలు, భూసారం వివరాలు, ఏ సమయంలో ఎలాంటి పంట వేయాలి, సాగునీటి నిర్వహణ, చీడపీడలు అరికట్టడం, పురుగు మందుల వాకడం, దిగుబడి అంచనా ఇలా అనేక వివరాలు రైతులకు సులువుగా అర్థమయ్యే రీతిలో స్మార్ట్‌ఫోన్ తెరపై కనిపిస్తాయి. ఏఐ టెక్నాలజీని అనుసరిస్తూ పండించిన పంట, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కోతకు రానుంది. ఈ ప్రయోగంలో భాగమైన రైతులందరికీ ఈసారి 30 నుంచి 40శాతం అదనపు ఆదాయం ఖాయమని అంచనా. అయితే టెక్ సేద్యానికి ఏఐతో పాటు అనేక అధునాతన సాంకేతికతలు మూలాధారం. శాటిలైట్ ఇమేజింగ్, రిమోట్ సెన్సింగ్, గ్రౌండ్ మిల్క్ ఇమేజింగ్, హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజ్ టెక్నాలజీ ద్వారా రైతుకు అవసరమైన సమాచారం మొత్తాన్ని యాప్ ద్వారా అందిస్తారు.
ఉపగ్రహం ద్వారా భూసార నివేదిక : పంట వేయడానికి ముందు భూసార పరీక్ష చేయడం మొదలుకుని, చెరకును మిల్లుకు తీసుకెళ్లే వరకు వేర్వేరు దశల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. చెరకు సాగు చేసే భూమి స్వరూపాన్ని ఏఐ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఉపగ్రహం ద్వారా అందిన భూసార నివేదిక, ప్రయోగశాలలో పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి కచ్చితమైన అంచనాకు వస్తుంది. భూసారం, భూసాంద్రత, ఆర్గానిక్ కార్బన్, నైట్రోజెన్, పాస్ఫరస్, పొటాషియం ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. తదనుగుణంగా సాగు వ్యూహాల్ని నిర్ణయిస్తుంది.
21 రోజుల్లో నాణ్యమైన చెరకు మొక్కలు : ఉప్పు నేలలు, మెట్ట భూముల్లోనూ చెరకు సాగుకు ఏఐ మార్గదర్శనం చేస్తుంది. విత్తన నాణ్యతను పట్టించుకోకుండా, అందుబాటులో ఉన్న మొక్కలు నాటడం దిగుబడి తగ్గేందుకు ముఖ్య కారణం. ఈ సమస్యకు ఏఐ పరిష్కారం చూపుతుంది. ఏ రకం విత్తనం వేయాలి.? ఎలా పెంచాలో రైతులకు సూచిస్తుంది.? ఇలా ఏఐ సలహాలు పాటిస్తే 21 రోజుల్లోనే నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో మొక్కను ఎంత దూరంలో నాటాలో కూడా ఏఐ సూచిస్తుంది.
ఏఐ విధానంలో పొలం దగ్గర సెన్సార్ : ఏఐ విధానంలో పొలం దగ్గర ఓ సెన్సార్‌ను అమర్చుతారు. ఇది ఎప్పటికప్పుడు మట్టి పరిస్థితి, ఉష్ణోగ్రత, తేమ శాతం, ఎరువుల అవసరాన్ని లెక్కగడుతుంది. ఉపగ్రహం అందించే సమాచారాన్ని, సెన్సార్ అందించే వివరాలను క్రోడీకరించి మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన సూచనలు చేస్తుంది. ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు అందించే సమాచారాన్ని విశ్లేషించే ఎసింక్ ఫ్యూజన్, ఉపగ్రహం తీసిన పంట ఫొటోలను ఏఐ ద్వారా స్పేస్ ఐ మెరుగుపరుస్తుంది.
ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని అంచనా వేసే డీప్ ఎమ్‌సీ వంటి సాంకేతికతలు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తాయి. వర్షం పడుతుందా, వరదలు, కరవు వచ్చే ముప్పు ఉందా వంటి విషయాలను ఏఐ ముందే గుర్తించి రైతుల్ని అప్రమత్తం చేస్తుంది. మట్టిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో రోజువారీ నివేదిక ఇస్తుంది. హైపర్ స్పెక్ట్రల్ కెమెరాల ద్వారా పంటను నిశితంగా పరిశీలించి పురుగు మందులు, ఎరువులు ఎప్పుడు వేయాలో సూచిస్తుంది. సాగునీరు ఎక్కువ ఖర్చు కాకుండా చూస్తుంది.
మొక్కకు ఎంత నీరు పెట్టాలో తెలిపే ఏఐ యాప్ : ఎరువుల్లోని పోషకాలను మొక్కలు బాగా స్వీకరించేందుకు ఏ సమయంలో, ఎంత మొత్తంలో నీరు పెట్టాలో ఏఐ యాప్ రైతులకు సూచిస్తుంది. డ్రిప్ వ్యవస్థలో ఎరువులను కలిపి, ఏఐ సూచించిన సమయానికి నీరు పెడితే చాలు. ఈ సలహాలను పాటిస్తే ఎక్కువ గణుపులు, గడలు వస్తాయి. చెరకు గడ పొడవు, లావు, బరువు గణనీయంగా పెరుగుతాయి. ఉపగ్రహ సమాచారం, గ్రౌండ్ సెన్సార్ డేటా సాయంతో పంట దిగుబడి ఎంత వస్తుందో 98 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఈ అంచనాలు చక్కెర మిల్లులు తమ ఉత్పత్తి, ఎగుమతి వ్యూహాలు రూపొందించుకునేందుకు ఉపకరిస్తాయి. దీని ద్వారా దీర్ఘకాలంలో ఒక్కో రైతులు ప్రతి టన్నుకు రూ.200 అదనపు ఆదాయం వస్తుందని, చక్కెర ఉత్పత్తి 0.5 నుంచి 2 శాతం పెరుగుతుందని అంచనా.
"చెరకు సాగులో సరికొత్త విప్లవం సృష్టించాం. ఏఐ వినియోగంతో 160 టన్నుల దిగుబడి సాధించడం ఎలాగో చేసి చూపాం. మూడేళ్ల క్రితం మా ప్రయోగాలు ప్రారంభించాం. 2024 జులైలో వెయ్యి మంది రైతులతో కలిసి ప్రయోగాత్మక సాగు చేపట్టాం. త్వరలోనే మహారాష్ట్రలో 50 వేల మంది రైతులకు ఏఐ సేద్యాన్ని విస్తరించబోతున్నాం. బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమూ మద్దతుగా నిలిచింది." - డాక్టర్ భూషణ్ గోసావి, వ్యవసాయ శాస్త్రవేత్త
చెరకు సాగులో తెగుళ్లను అరికట్టవచ్చు : కృత్రిమ మేధ సాయంతో చెరకు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గి, ఆదాయం పెరుగుతుందని మహారాష్ట్ర రైతులు చెబుతున్నారు. సాగునీరు, ఎరువులు ఇలా ప్రతిదీ సంప్రదాయ పద్ధతితో పోల్చితే తక్కువ అవసరం అవుతున్నాయని అంటున్నారు. ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30 శాతం తగ్గుతుంది. ఫలితంగా రైతుకు 10 నుంచి 15వేలు రూపాయలు ఆదా అవుతుంది. చీడపీడలపై రైతులను ఏఐ ముందే హెచ్చరిస్తుంది.
తద్వారా పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించకముందే గుర్తించి, ప్రభావిత ప్రాంతంలో పురుగు మందులు చల్లే అవకాశం ఉంటుంది. అలా రైతుకు డబ్బులు ఆదా అవుతాయి. సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం, ఉష్ణోగ్రత వంటి వివరాలను కచ్చితంగా తెలుసుకుని, సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే 40 నుంచి 50 శాతం నీరు ఆదా అవుతుంది. మిగిలిన నీటితో అదనంగా మరో ఎకరం సాగు చేయవచ్చు.
"ఒకప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో చెరకు, అరటి సాగు చేశాను. ఇప్పుడు బారామతి పైలట్ ప్రాజెక్టులో చేరి 2 ఎకరాల్లో ఏఐ ఆధారిత చెరకు సాగు చేస్తున్నా. మరో 16 ఎకరాల్లో సాంప్రదాయ పద్ధతినే అనుసరిస్తున్నా. ఏఐ టెక్నాలజీ వాడకంతో ఫలితం చాలా బాగుంది. ఈసారి ఎకరాకు 30శాతం అధిక లాభం వస్తుందని అనుకుంటున్నా. ఇకపై మొత్తం వ్యవసాయం ఏఐ సాయంతోనే చేయాలని నిర్ణయించుకున్నా." - మహేంద్ర థోరట్, ఏఐ రైతు
చెరకు ఒక్కో గడ 55 గణుపులు పెరుగుతుంది : సాధారణంగా చెరకు నెలకు 2 నుంచి 2.5 గణుపుల మేర పెరుగుతుంది. మొత్తంగా ఒక్కో గడకు 45 గణుపులు ఉంటాయి. అదే ఏఐ సాగులో నెలకు 3.5 నుంచి 4 గణుపులు పెరుగుతాయి. మొత్తంగా 55 గణుపులు ఉంటాయి. ఫలితంగా ఒక్కో చెరకు గడ బరువు 2 కిలోలు అధికంగా ఉంటుంది. ఇలా ఎకరాకు 120 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏఐ సాగు విధానంలో ఎకరాకు రూ.30 వేలు నుంచి రూ.40వేలు పెట్టుబడి పెడితే రూ.3లక్షల ఆదాయం వచ్చే అవకాశముంది. సాధారణ పద్ధతిలో పెట్టుబడి ఖర్చు రూ.60 వేలు నుంచి రూ.70 వేలు ఉండగా ఎకరాకు వచ్చే దిగుబడి 50 నుంచి 60 టన్నులు. ఆదాయం రూ.2లక్షలు అని రైతులు చెబుతున్నారు.
ఏదైనా గ్రామం లేదా ఒక ప్రాంతానికి చెందిన 25 మంది రైతులు బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావచ్చు. 2 ఎకరాల్లో ఏఐ సాగు చేసేందుకు సభ్యత్వ రుసుముగా ఒక్కో రైతు రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. పొలంలో తేమ శాతం, ఉష్ణోగ్రతను తెలిపే సెన్సార్లు అమర్చుతారు. చెరకు సాగులోని 5 ప్రధాన దశల్లో రైతుకు అవసరమైన సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా అందిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ, టెస్లా అధినేత అభినందనలు : వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చెప్పేందుకు బారామతి రైతుల విజయగాథ అద్భుత ఉదాహరణ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎక్స్‌లో ఈ పోస్ట్‌పై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించారు.
టీబీ వ్యాధి గుర్తింపులో AI విప్లవం! - కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన
'కాంపాక్ట్ ఏఐ'ని ఆవిష్కరించిన ఐఐటీ మద్రాస్- ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే సామర్థ్యం!