Ramoji Rao First Death Anniversary : 'అమరం, అపూర్వం మీ చరిత. ఆ వెలుగులో మునుముందుకు సాగడమే మా భవిత' అంటూ రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావుకు కుటుంబ సభ్యులు, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది నివాళులర్పించారు. రామోజీరావు దివంగతాలకేగి ఏడాది పూర్తైన వేళ ఆ మహనీయుడి సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు.
ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం సృష్టికర్త. పాత్రికేయ విజయ పతాక. భారతీయ చలన చిత్రరంగంలో చెరగని చరిత. తెలుగుజాతి మార్గదర్శి. దేశ రెండో అత్యున్నత పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ రామోజీరావు దివంగతాలకేగి అప్పుడే ఏడాది. ప్రత్యేకంగా, పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ఆ మహానుభావుడి ప్రథమ వర్ధంతిని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల సీఎండీ కిరణ్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సహరి, యూకేఎంఎల్ డైరెక్టర్ సోహన, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిటర్లు ఎం.నాగేశ్వరరావు, డీఎన్ ప్రసాద్, రామోజీ గ్రూపు సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు, విభాగాధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు.
రామోజీగ్రూపు సంస్థల విభాగాధిపతులు రామోజీరావు క్రమశిక్షణ, దార్శనికత, వృత్తి నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఏనాడూ కృషిని తప్ప అదృష్టాన్ని నమ్ముకోలేదని ఈటీవీ సీఈవో బాపినీడు స్మరించుకున్నారు. దివంగత రామోజీరావుతో కలిసి దశాబ్దాలుగా ప్రయాణించిన రామోజీ గ్రూపు సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు, స్వీయ క్రమశిక్షణ, సమయ పాలనకు రామోజీరావు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారని చెప్పారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన రామోజీరావు, తన బలం సిబ్బంది అని సగర్వంగా చెప్పేవారని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.
నలుగురు నడిచే దారుల్లో కాకుండా కొత్త మార్గాలు వెదకాలంటూ రామోజీరావు ఎప్పుడూ ఉద్యోగులు, సిబ్బందిని ప్రోత్సహించేవారని రామోజీ ఫిల్మ్‌సిటీ పబ్లిసిటీ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రావు, ఈటీవీ భారత్ సీఈవో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్మరించుకున్నారు. రామోజీరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన జీవిత విశేషాలను వివరించే వీడియో, ఉద్యోగులకు ఉద్దేశించి రామోజీరావు రాసిన బాధ్యతల వీలునామాను ప్రదర్శించారు. ఆయన జీవన ప్రయాణంలోని కీలక ఘట్టాలను వివరించే ఫొటో ప్రదర్శన అందరిలో స్ఫూర్తి నింపింది.
ఓ మహర్షి మళ్లీ జన్మించవా! - నీ రాక కోసం తెలుగు జాతి ఎదురుచూస్తోంది