కలకలం రేపుతున్న 'నకిలీ ఈ-స్టాంపు'ల కుంభకోణం - ముగ్గురు అరెస్ట్
కల్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం జరిగిందన్న ఎస్పీ జగదీశ్ - నకిలీ ఈ-స్టాంపులపై అనంతపురం ఎస్పీ జగదీశ్ మీడియా సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2025 at 8:20 PM IST
Fake E-Stamp Scam in AP : అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. మీసేవ నిర్వహకుడు బోయ ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి తమను మోసం చేశాడని ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ఏజీఎం సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జగదీశ్ మీడియా సమావేశం నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు తయారుచేసి విక్రయించాడని ఎస్పీ పి. జగదీష్ చెప్పారు. నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి మోసం చేశాడని ఎస్ఆర్ ఇన్ ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఫిర్యాదు మేరకు బోయ ఎర్రప్ప, మోహన్ బాబు, భువనేశ్వర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. మీసేవ నిర్వహకుడు బోయ ఎర్రప్ప రెండేళ్లుగా 15,413 స్టాంపులు విక్రయించాడని, వీటిలో ఎస్ఆర్ ఇన్‌ఫ్రా వారికి 438 ఇచ్చినట్లు తెలిపారు.
ఎస్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ఈ-స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు 32 లక్షల రూపాయలు బదిలీ చేసిందని వెల్లడించారు. అయితే దీనిలో 25.48 లక్షల రూపాయలు కాజేసి ఆ మొత్తానికి నకిలీ ఈ-స్టాంపులు ఇచ్చాడన్నారు. ఈ మొత్తం ప్రభుత్వానికి చెల్లించకుండా బోయ ఎర్రప్ప మోసం చేయడమే కాకుండా, ఎస్ఆర్ ఇన్‌ఫ్రా వారికి నకిలీ స్టాంపులు తయారు చేసి ఇచ్చాడని చెప్పారు. ఎస్ఆర్ ఇన్‌ఫ్రా కూడా నకిలీ ఈ-స్టాంపుల బాధితులేనని, వారికి బోయ ఎర్రప్ప 23.48 లక్షలు మోసం చేశాడని ఎస్పీ జగదీష్ తెలిపారు.
"కల్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం జరిగింది. నకిలీ ఈ-స్టాంపులపై ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ఏజీఎం సతీశ్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఎర్రప్ప, మోహన్‌బాబు, భువనేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఉదయం ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెడతాం. 438 ఈ-స్టాంపుల కోసం ఎర్రప్పకు ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా డబ్బు చెల్లించింది. మీ సేవ నిర్వాహకుడు ఎర్రప్పకు ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా రూ.32 లక్షలు చెల్లించింది. ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాకు ఎర్రప్ప రూ.25.48 లక్షల విలువైన నకిలీ ఈ-స్టాంపులను విక్రయించారు. ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి రూ.25.48 లక్షలు కాజేశారు. ఈ-స్టాంపుల కోసం ఎర్రప్ప రూ.6.52 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారు. ఎర్రప్ప ఇప్పటివరకు 15,413 ఈ-స్టాంపులు విక్రయించాడు. నకిలీ ఈ-స్టాంపుల విక్రయంలో ఎర్రప్ప ప్రధాన నిందితుడు." - పి.జగదీష్, అనంతపురం జిల్లా ఎస్పీ
ప్రతి నెలా లక్షకు 6 వేలు ఇస్తానని ప్రచారం - రూ.300 కోట్లు దోపిడీ
వాళ్లంతా ఐఐటీల్లో చదువుకున్నారు - చివరికి స్కామ్‌లో ఇరుక్కున్నారు

