ఆపద చెప్పి రాదు! - ఈ అత్యవసర నెంబర్లు, మందులపై అవగాహన తప్పనిసరి
ప్రథమ చికిత్స కిట్ ఇంటింటా తప్పనిసరి - అందుబాటులో అత్యవసర మందులను ఉంచుకోవడం శ్రేయస్కరం - ఇరుగు, పొరుగు వారితోనూ పరిచయాలు పెంచుకోవాలంటున్న నిపుణులు

Published : June 29, 2025 at 11:41 AM IST
|Updated : June 29, 2025 at 11:47 AM IST
Story on Medical Emergency Telugu : మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం కూడా మారుతోంది. దీనిలో భాగంగా మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంది. నేడు మనుషుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కనీసం ఇరుగు, పొరుగు వారితోనూ సరిగ్గా పరిచయాలు లేని పరిస్థితిలో చాలా మంది ఉంటున్నారు. ఇది సరైన రీతి కాదని నిపుణులు చెబుతున్నారు. మనకు ఏదైనా ప్రమాదాలు జరిగితే, దగ్గరిలోని వారే మనల్ని కాపాడగలరని సూచిస్తున్నారు.
మచ్చుకు ఓ సంఘటన : రాకేశ్, రమ దంపతులది అన్యోన్య జీవనం. వారికిద్దరు సంతానం. వారు రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు. వారికి చుట్టుపక్కల వాళ్లతో పెద్దగా పరిచయాల్లేవు. ఓ రోజు రాకేశ్ అధిక రక్తపోటుతో స్పృహ కోల్పోగా, భార్య, పిల్లలకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరి సాయం కోరాలో తెలీలేదు. దీంతో కుటుంబ సభ్యులే రాకేశ్‌ను దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి, ఓ పావు గంట ముందు తీసుకొస్తే బాగుండేదని చెప్పడంతో ఆ కుటంబం శోకసంద్రంలో మునిగింది.
మరో చోట ఇలా : అదొక చిన్న అపార్టుమెంటు. అందులోని వారు ఉదయపు నడకలో కలుసుకుంటారు. చీకటి పడ్డాక ‘ముచ్చట్ల’లో లీనమవుతారు. ఓ రోజు అందులోని ఒకరు ఛాతీలో నొప్పిగా ఉందని విలవిల్లాడుతుంటే కుటుంబ సభ్యులు తమ ఫ్లోరులోని వారిని సంప్రదించారు. వారిలో ఒకరు సీపీఆర్ చేయగా, మరొకరు 108కి ఫోన్ చేశారు. ఆసుపత్రిలో సిద్ధంగా ఉన్న సిబ్బంది వైద్యం అందించారు. సమయానికి తీసుకుని రావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు.
ఆపద చెప్పి రాదు! : సొంతూర్లను వదిలి ఎక్కడో దూరంగా జీవిస్తుంటాం. ఆపద ‘చెప్పి’ రాదు. కరోనా తర్వాత అకస్మాత్తు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసర నెంబర్లు గుర్తు పెట్టుకోవాలి. చుట్టుపక్కల కుటుంబాలతో కలివిడిగా ఉండాలి. అప్పుడే మనకు అండ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే మేలు : డోర్నకల్‌లోని ఓ ఇంట్లో లోపల తలుపునకు అంటించిన కాగితంపై ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నెంబర్, ఇంటికి ఇరువైపులా ఉండే కుటుంబాల ఫోన్ నెంబర్లు, ఆప్తమిత్రులు, సమీప అగ్నిమాపక కేంద్రం నెంబర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే మేలు.

చాతినొప్పి, బీపీ వంటివి ఉంటే ముందుగా వైద్యుల్ని సంప్రందిస్తే వారు తక్షణం ఉపశమనం కలిగించే మందులు ఇవ్వొచ్చు. వాటిని అందుబాటులో ఉంచుకోవాలి. ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు వాడాలి.
- డా.విరాజిత, కురవి పీహెచ్‌సీ వైద్యాధికారి
ఇవి మన నేస్తాలు :
అత్యవసర సమయాల్లో ప్రజల రక్షణకు ఉచిత సహాయవాణి (టోల్ ఫ్రీ) నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుంది
| 100 | పోలీసు |
| 108 | వైద్య సహాయం |
| 101 | అగ్ని ప్రమాదం |
| 1098 | పిల్లల సంరక్షణ |
| 1930 | సైబర్ నేరం |
| 1033 | జాతీయ రహదరిపై సమస్య ఏర్పడితే |
హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!

