Controlling Adulterated Liquor : రాష్ట్రంలో మద్యం రాబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ధరల నిర్ణయ కమిటీ సిఫారసుల మేరకు బీరు, లిక్కర్ ధరలను పెంచిన అబ్కారీ శాఖ, ఏడాదికి మూడున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మద్యం విక్రయాలు మరింత పెరగాలంటే క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. చాలా జిల్లాల్లో ఇప్పటికే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు, గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బాగా పని చేశారంటూ అబ్కారీ శాఖ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం 30 మంది అధికారులకు నగదు పురస్కారాలు ఇవ్వగా, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మాత్రం మద్యం విక్రయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పనితీరును బేరీజు వేసి సమీక్ష నిర్వహించారు. ఇందులో జిల్లాల వారీగా అక్రమ కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ తీసుకున్న చర్యలు, అక్కడ జరిగిన మద్యం విక్రయాలను బేరీజు వేసినట్లు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో గుడుంబా తయారీ జోరుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
గుడుంబా కట్టడి ఎలా : వాస్తవానికి క్షేత్రస్థాయి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార యంత్రాంగానికి అందే పక్కా సమాచారంతో, అక్రమ మద్యం, గుడుంబా తయారీ కేంద్రాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆలాంటి పరిస్థితి దాదాపు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడంలేదని కమిషనర్ హరికిరణ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మద్యం రాబడి పెరగడం లేదంటే, అక్రమ కార్యకలాపాలు కట్టడి కానట్లుగానే భావించాల్సి వస్తోందని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ బాగా పని చేస్తుందని భావిస్తున్న ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై పడడం లేదని, ఇందుకు కారణాలను అన్వేషించాలని కమిషనర్ ఆదేశించినట్లు అబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే వేటు తప్పదు : కల్తీ కల్లుకు వాడే మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కల్లు కాంపౌండ్లపై దాడులు చేయడం కాకుండా, కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే డైజోఫాం, ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్‌ల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎవరి స్థాయిలో వారు పని చేయాల్సిందేనని కమిషనర్ స్పష్టం చేశారు. కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలంటే, పై అధికారుల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని కమిషనర్ అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దానిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోనని కమిషనర్ హెచ్చరించారు.
KALLU EFFECT: కల్తీ కల్లు తాగి పది మందికి అస్వస్థత
కల్లు దుకాణాలపై అధికారుల రైడ్స్.. 'కల్తీ అని తేలితే కఠిన చర్యలు'