నకిలీ బ్రాండ్లు - నాసిరకం సరకు - విజయవాడ బస్టాండ్‌లో నయా దందా
అధిక ఎమ్మార్పీ ముద్రణ - ఆరోగ్యంతో చెలగాటం - ప్రయాణికులను దోచేస్తున్న వ్యాపారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 13, 2025 at 12:01 PM IST
Excessive Charges on Water Bottles And Cold Drinks at Vijayawada Bus Stop : విజయవాడ బస్టాండ్‌లో ఓ దుకాణంలో అధిక ఎమ్మార్పీ ముద్రించిన నీటి బాటిల్లు ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీల లీటర్ బాటిల్ విలువ రూ.20. ఇక్కడ మాత్రం లోకల్ కంపెనీల లీటర్ బాటిల్‌పై రూ.25 ఎమ్మార్పీ ఉంటుంది. ఇదేంటని ప్రశ్నిస్తే కొంటే కొనండి లేకుంటే పొండి అంటారు దుకాణాదారులు.
బస్టాండ్‌లో విక్రయానికి పెట్టిన తాగునీటి బాటిళ్లు, శీతల పానీయాల బాటిళ్లలో దాదాపు ఏవీ గుర్తింపు ఉన్న కంపెనీలవి కాదు. చూడడానికి అన్నీ ప్రముఖ కంపెనీల మాదిరిగానే కనిపిస్తాయి. బ్రాండెడ్ కంపెనీల్లానే పరిమాణం, ఆకృతి, అదే రంగు లేబుళ్లతో తయారు చేస్తారు. కంపెనీ పేరు సైతం చిన్న అక్షరం మార్పుతో అదేవిధంగా ఉంటుంది. దీంతో తెలియని వారే కాదు చదువుకున్న వారు సైతం మోసపోతున్నారు.
విజయవాడ బస్టాండ్‌లో వ్యాపారులు కొత్త రకం దోపిడీకి తెరదీశారు. అధిక ధరలు, నాణ్యత, పరిమాణం లోపాలతో సొమ్ము చేసుకునే స్థాయి నుంచి ఏకంగా స్వయంగా ఎమార్పీలు ముద్రించి దోచుకునే వరకు వచ్చారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసి ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
రూ.కోట్లలో దోపిడీ : తాగునీరు బాటిళ్లు మొదలు, శీతల పానీయాలు, స్నాక్స్, ఫ్యాన్సీ ఇలా ఏ వస్తువు చూసినా బ్రాండెడ్ వస్తువులు కన్పించవు. అన్ని లోకల్ కంపెనీలే దర్శనమిస్తాయి. ఈ వస్తువుల తయారీదారులతో వ్యాపారులు కుమ్మక్కై తయారీ ప్రాంతాల్లోనే అధిక ఎమ్మార్పీలు ముద్రిస్తున్నారు. ఈ వస్తువులు బ్రాండెడ్ వస్తువుల ధరలో సగానికే కొని గుర్తింపు ఉన్న కంపెనీల కంటే 10 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
రాత్రి 10 దాటితే 20 శాతం అదనపు వడ్డింపు తప్పదు. దీంతో ప్రయాణికులను మోసం చేయడమే కాకుండా వారి ఆరోగ్యంతోనూ ఆడుకుంటున్నారు. ఇలా అన్ని వస్తువుల్లో కలిపి ఒక్కో దుకాణదారుడు రోజుకు రూ.20 వేల వరకు దోచేస్తున్నారు. బస్టాండ్‌లో అన్ని దుకాణాలు కలిపి రోజుకు రూ.25 లక్షల చొప్పున నెలకు రూ.7 కోట్లకు పైనే దోపిడీ జరుగుతోంది.
కార్లు తాకట్టు పెట్టి ఆపై కేసులు పెట్టించి - వ్యాపారులను దోచుకున్న కేటుగాడు
అంతా మా ఇష్టం : విజయవాడ బస్టాండ్ నుంచి రోజుకు లక్షన్నర మంది రాకపోకలు సాగిస్తుంటారు. సిటీ బస్సులతో కలిపి మూడు వేల బస్సులు వచ్చి వెళ్తుంటాయి. బస్టాండ్ ఆవరణలో 127 దుకాణాలు ఉన్నాయి. 90 శాతం దుకాణాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించరు. ఏళ్లుగా పాతుకుపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల పరిమాణం, ధరకు పొంతన ఉండదు.
కొన్ని తినుబండారాలపైన ఎమ్మార్పీ, గడువు తేదీ కూడా ఉండదు. చాలా దుకాణాల్లో ధరల పట్టికలు కనిపించనంత చిన్నగా ఉంటాయి. ప్రయాణికులు సైతం ఎప్పుడో ఒకసారి వస్తాం కదా అని పట్టించుకోవడంలేదు. అధికారులకు తెలిసినా అరకొర జరిమానాలతో మమ అనిపిస్తున్నారు. అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఆర్‌ఎం దానం తెలిపారు.
అంతా మా ఇష్టం - అనధికార బస్టాప్‌లతో ప్రైవేట్ ట్రావెల్స్ దందా

